హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తేతెలంగాణ): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 1,38,427 కేసులు పరిష్కారమయ్యాయని డీజీపీ జితేందర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 5, 355 మంది సైబర్ బాధితులకు రూ. 27.2 కోట్ల రిఫండ్ చేశామని పేర్కొన్నారు. జూన్‌లో నిర్వహించిన లోక్ అదాలత్‌తో పోల్చితే ఇది రూ. 5.6 కోట్లు అధికమని చెప్పారు. ఫిబ్రవరి 20 నుంచి ఇప్పటి వరకు 11,868 మంది బాధితులకు రూ.114.7 కోట్లను రిఫండ్ చేశామని తెలిపారు.
కేసుల పరిష్కారంలో నిజామాబాద్(19,053), హైదరాబాద్ (12,247), సూర్యాపేట(11,178), సైబరాబాద్(10,935), రాచకొండ (9,823) ముందుస్థానంలో నిలిచాయని వెల్లడించారు. సైబర్ బాధితులకు రికవరీ నగదు చెల్లింపులో సైబరాబాద్ (రూ.13.73 కోట్లు), రాచకొండ (రూ.3.01 కోట్లు), టీజీసీఎస్బీ(రూ.2.50కోట్లు), సంగారెడ్డి (రూ.1.91కోట్లు), కరీంనగర్ (రూ. 84.21 లక్షలు) యూనిట్లు అగ్రస్థానంలో నిలిచినట్టు పేర్కొన్నారు.
ఇందుకు కృషి చేసిన టీజీఎస్సీఆర్బీ డీఐజీ నారాయణ్‌నాయక్, డీఎస్పీలు సూర్యచందర్‌రావు, చెన్నయ్య, అధికారులు దేవేందర్‌సింగ్, హరికృష్ణ, సైబర్‌క్రైమ్ బ్యూరో డీజీపీ శిఖాగోయల్‌ను డీజీపీ అభినందించారు.