హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను 90 రోజుల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన తరుణంలో జరుగబోయే పరిణామాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొన్నది. ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులు ఏమిటనే అంశంపై చర్చ జరుగుతున్నది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50% మించకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఉన్నది. ఈ పీటముడిని విప్పితేగానీ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే పరిస్థితి లేదు. నేటికీ సర్కారు రిజర్వేషన్లపై ఎటూ తేల్చకుండా నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నది.
సుప్రీంకోర్టు ట్రిపుల్ టీ పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో మొదటిది ప్రతీ స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమ లు, ఫలితాలపై అధ్యయనం కోసం రాజ్యాంగబద్ధమైన, డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటుచేయాలి. రెండోది జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. మూడోది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50 శాతానికి మించకూడదు. తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదించింది. దానికి ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు కాబట్టి 42% రిజర్వేషన్ అమలయ్యే పరిస్థితి లేదు. అన్నీ కలిపి 50% రిజర్వేషన్ మించకూడదనే అంశం కూడా కొలిక్కి రాలేదు. చివరి రెండు అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉన్నది.
2019లో స్థానిక ఎన్నికల కోసం నాటి జనాభా ప్రాతిపదికన బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68% చొప్పున రిజర్వేషన్లు కేటాయించారు. గత ఎన్నికల తరహాలో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావించినా బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ గడువు ముగిసినందున మళ్లీ కమిషన్ వేయాల్సి ఉంటుంది. కొత్త కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దానిపై క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్న తరువాత, రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో జారీ చేయాల్సి ఉంటుంది.
అలా చేస్తేనే హైకోర్టు ఆదేశించినట్టుగా 90 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం గ్రామ పంచాయతీల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో రొటేషన్, రిజర్వేషన్లు నిర్ణయించడం కోసం గెజిట్ పబ్లికేషన్ ఇస్తరు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితేనే జూలై 20 వరకు ఫైనల్ గెజిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ఎన్నికలు మొదట నిర్వహించాలనేది కూడా ప్రభుత్వమే తేల్చాల్సి ఉన్నది. ఫైనల్ గెజిట్ కాపీని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తే అప్పుడు అసలైన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తొలుత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తుంది. నోటిఫికేషన్ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ, అనంతరం పరిశీలన, విరమణ ప్రక్రియలకు ఎస్ఈసీ గడువులు విధిస్తుంది. నోటిఫికేషన్లో నిర్దేశించిన తేదీల ప్రకారం ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 12,777 గ్రామా లు,1.13 లక్షల వార్డులు ఉన్నాయి. 566, ఎంపీపీ, జడ్పీటీసీలున్నాయి. పంచాయతీ ఎన్నికలను ఐదు రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా నిర్వహించే అవకాశం ఉన్నది. పోలింగ్ రోజే సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఉంటాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఒకేరోజు ఎన్నికలు నిర్వహించే వీలుంది.