Liquor Prices | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): అక్కడా..ఇక్కడా అదే మద్యం. వాళ్లకు సరఫరా చేసే కంపెనీలే ఇక్కడా అందిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో బేసిక్ ధర మీద 20% మేర ధర తగ్గించుకున్న ఆ కంపెనీలు తెలంగాణలో మాత్రం 30% అదనంగా ధర పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. మద్యం ధరల ఖరారుకు రెండు రాష్ర్టాల ప్ర భుత్వాలు వేర్వేరుగా కమిటీలు వేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో 11 బ్రాండెడ్ మద్యం కంపెనీలు తమకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద 20% మేరకు ధరలను తగ్గించుకుంటున్నట్టు ప్రకటించాయి. దేశంలో తయార య్యే విదేశీ మద్యం వెరైటీలపై 5 నుంచి 12%, ఇతర క్యాటగిరీల మద్యంపై 20 % బేసిక్ ధర తగ్గించుకుంటున్నట్టు వెల్లడించాయి. దీంతో ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గుతున్నాయి.
క్వార్టర్ బాటిల్‌పై కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.80 వరకు తగ్గే అవకాశం ఉన్నట్టు సమాచారం. అదే సమయం లో తెలంగాణలో మాత్రం అన్ని బ్రాండ్ల మద్యం ధరలు భారీగా పెరగబోతున్నాయి. కనీసం 30% ధరలు పెంచాలన్న మద్యం కంపెనీల డిమాండ్లకు అనుగుణంగా కమిటీ సిఫారసుల ఫైలు సీఎం రేవంత్‌రెడ్డి టేబుల్ వద్దకు చేరినట్టు తెలిసింది. అయితే ఎంతమేరకు పెంచుతారన్నదానిపై స్పష్టత రాలేదు.
తమకు చెల్లించే బేసిక్ ధరలు పెంచాలని డిస్టిలరీలు, బ్రూవరీలు, లిక్కర్ సప్లయ్ కంపెనీలు ప్రతి ఏడాది డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం వచ్చాక మద్యం ధరలను సమీక్షించి పెంచగా.. తెలంగాణలో కొన్నేళ్లుగా పెంచటం లేదనేది మద్యం కంపెనీల వాదన. నిజానికి ప్రతి ఏడాది మద్యం కంపెనీలు ఇటువంటి డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచటం, ప్రభుత్వం ఆ డిమాండ్లను తిరస్కరించటం జరుగుతున్నది. కేసీఆర్ హయాంలో మద్యం వ్యాపారుల డిమాండ్లను తిరస్కరించారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగకుండా జాగ్రత్తపడ్డారు.
మద్యం ధరల ఖరారుకు ఏపీ ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ బ్రాండెడ్ కంపెనీ ధరల ఒప్పందం మీద చర్చలు జరిపింది. బాటిల్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతోపాటు ఇతర రాష్ర్టా ల్లో విక్రయిస్తున్న ధరలను పరిశీలించింది. ఏపీ, తెలంగాణలో విక్రయించే బ్రాండ్ల ధర ల్లో భారీ తేడాలున్నట్టు గుర్తించింది. దీంతో బ్రాండెడ్ కంపెనీల ధరల నిర్ణయ విశ్వసనీయతపై కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. దీంతో మద్యం కంపెనీలు తమంతట తామే ధరలు తగ్గించుకుంటున్నట్టు ప్రకటించాయి.
తెలంగాణలో కూడా మద్యం ధరలను నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో ఓ కమిటీ వేసింది. జూలై 25లోగా మద్యం సరఫరా కంపెనీలు ధరలను కోట్ చేస్తూ సీల్డ్ కవర్ ఇవ్వాలని ఆ కమిటీ సర్క్యులర్ జారీచేసింది. ఆ కవర్లను అదే నెల 26న తెరిచి చూ సింది. మద్యం సప్లయ్ చేయటానికి 91 కంపెనీలు ముందుకు వచ్చాయి. బీరు, బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ మద్యం కలుపుకొని మొత్తం 1032 బ్రాండ్లకు ధర కోట్ చేశారు. ఇందులో 755 బ్రాండ్లు పాతవే కాగా, కొత్తగా 277 బ్రాండ్లకు టెండర్లు పడ్డాయి. అన్ని కంపెనీలు కూడా 20% నుంచి 30% వరకు ధర పెంచాలని కోరినట్టు సమాచారం. తెలంగాణ ప్రభు త్వం మద్యం ధరను పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఫైల్ సీఎం వద్ద ఉన్నదని, త్వరలోనే ఒక తుది రూపు రావచ్చని సమాచారం.