హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): గోదావరిలో ఏపీ 493.5 టీఎంసీలకు మించి ఉపయోగించుకోకుండా కట్టడిచేయాలని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ కోరింది. పోలవరం ఆధారంగా ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులన్నీ నిలిపివేయించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్ లెఫ్ట్, రైట్ మెయిన్ కెనాళ్ల నుంచి రోజుకు 1.7 టీఎంసీల చొప్పున మొత్తంగా 449.78 టీఎంసీలు మాత్రమే తీసుకొనేందుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం దానిని అధిగమించి రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకొనేలా కాల్వల విస్తరణ పనులు చేపట్టి.. కేటాయింపులకు మించి నీటిని తీసుకొనే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. కేటాయింపులకు మించి ఏపీ నీటిని ఉపయోగించుకుంటే ఎగువ రాష్ట్రమైన తెలంగాణ ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.
పోలవరం నుంచి త్వరగా ఫలాలు అందుకొనేందుకు ఏపీ పలు ఎత్తిపోతల పథకాలు చేపట్టిందని వివరించారు. పుషర (11.8 టీఎంసీలు), చెంగల్నాడు (2.85), తొర్రిగడ్డ (2.41), తాడిపూడి (11.47), పట్టిసీమ (80 టీఎంసీలు) లిఫ్ట్ సీంలు నిర్మించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయి, నిర్వహణలోకి వచ్చిన తర్వాత ఈ సీంలకు నికర, మిగులు జలాల నుంచి హకు కోరే ఆసారం లేదని తెలిపారు. లిఫ్ట్ సీంలకు పరిమితం కాకుండా మిగులు జలాల ఆధారంగా వెంకటనగరం (3.62), ఉత్తరాంధ్ర సుజల స్రవంతి/పురుషోత్తపట్నం (63.2), చింతలపూడి (53) ఎత్తిపోతలను బేసిన్ అవతలికి నీటిని తరలించడానికి చేపట్టిందని పేర్కొన్నారు. వీటికి నికర జలాల్లో హకు కోరే అవకాశం ఏపీకి లేదని స్పష్టంచేశారు. కృష్ణా-పెన్నా లింక్ పేరుతో 350 టీఎంసీలు తరలించే ప్రాజెక్టుకు గోదావరి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవని తెలిపారు. పోలవరం ఆధారంగా పలు విస్తరణ ప్రాజెక్టులు చేపడుతున్నామని పలు సందర్భాల్లో ఏపీ ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ అక్రమ ప్రాజెక్టులతో గోదావరి డెల్టా సిస్టంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 493.50 టీఎంసీలు మాత్రమే దకుతాయని, అందులోంచే గోదావరి డెల్టా సిస్టంకు 224.3 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుందని పేరొన్నారు. నీటి కేయింపులపై ఎలాంటి హామీలు లేకుండానే ఏపీ సర్కారు అక్రమ ప్రాజెక్టులు చేపడుతున్నదని, అదేసమయంలో ఉమ్మడి రాష్ట్రంలో నికర జలాల ఆధారంగా తలపెట్టిన తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు లేవంటూ పదే పదే ఫిర్యాదులు చేస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీని గరిష్ఠంగా 493.50 టీఎంసీలు మాత్రమే వినియోగించుకొనేలా కట్టడి చేయాలని, అంతకుమించి నీటిని తీసుకొనేలా చేపట్టిన ప్రాజెక్టులను వెంటనే ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దాని నుంచి అనధికారికంగా నీటిని తరలించే అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయించే అధికారం కేంద్రానికి ఉన్నదని రజత్‌కుమార్ గుర్తుచేశారు.