హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ తడాఖా చూపిస్తామని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమి తి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. యాసంగి వడ్లు కొనాలనే డిమాండ్‌తో 11న ఢిల్లీలో టీఆర్ఎస్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు 1500 మందితో ధర్నా చేస్తామని తెలిపారు. శుక్రవా రం ఢిల్లీ తెలంగాణభవన్ ఆవరణలో ధర్నా వేదిక ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధినే త, సీఎం కేసీఆర్ విప్లవాత్మక చర్యలతో తెలంగాణలో 600 శాతం అధికం ధాన్యం పండిందని వివరించారు. ఒకే ఏడాది లో మూడు కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చిందని చెప్పారు.
పురోగమిస్తున్న తెలంగాణకు అండగా నిలవాల్సిన కేంద్రం, కక్షపూరితంగా వ్యవహరిస్తూ ధాన్యం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డా రు. 11న ఢిల్లీలో ధర్నాతో కేంద్రం దిగిరాకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించా రు. కేంద్రం వైఖరిని జాతీయస్థాయిలో ఎండగట్టేందుకే ఈ నిరసన చేపట్టామని తెలిపారు. పంజాబ్, హర్యానా రైతులు రెండు సీజన్లలో పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చారని, రాష్ట్ర రైతుల ఉద్యమానికి కేంద్రం తలవంచక తప్పని పరిస్థితులు సృష్టిస్తామని వెల్లడించారు. ధర్నాకు సీఎం కేసీఆర్ హాజరయ్యే విషయాన్ని అదేరోజు వెల్లడిస్తామని చెప్పారు.