హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందినవారికి దక్కాల్సిన రాజ్యసభ సభ్యత్వాన్ని ఉత్తరాదికి చెందిన తమ పార్టీ నేతకు కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సీనియర్ నేత కే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగే ఎన్నికలో అభ్యర్థిగా అభిషేక్ మనుసింఘ్వీని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
ఈ మేరకు ఆ పార్టీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభిషేక్ సింఘ్వీ ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు వచ్చిన అవకాశాన్ని రాజస్థాన్‌కు చెందిన నేతకు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. లేకలేక వచ్చిన అవకాశం, ఒకే ఒక్క స్థానానికి జరుగుతున్న ఎన్నికలో ఆ అవకాశాన్ని కూడా తెలంగాణ నేతలకు ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు.
రాజ్యసభకు పంపించేందుకు తెలంగాణ నుంచి ఒక్క నేత కూడా దొరకలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజ్యసభ సీటును ఆశించిన పలువురు నేతలు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర పార్టీల అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. వైఎస్ హయాంలో కూడా ఇదే విధంగా తెలంగాణకు దక్కాల్సిన రాజ్యసభ పదవులను ఇతర రాష్ర్టాలవారికి కట్టబెట్టిన వైనాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు.
తొలి రోజు నామినేషన్లు నిల్
రాష్ట్రంలో జరుగనున్న ఏకైక రాజ్యసభ స్థానం ఉపఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్‌తోపాటు నామినేషన్ల స్వీకరణను ప్రారంభించగా తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.