హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘కాళోజీ గొప్ప విప్లవ కవి. ప్రజల మాటలే ఆయన కవితలు. అన్యాయాలు, అణిచివేతలను ప్రశ్నించి సామాన్య ప్రజల వకీల్‌గా కాళోజీ నిలిచారు. కాళోజీ వారసత్వాన్ని కొనసాగిస్తూ కుల, మత పిచ్చిలేని రాష్ట్రం కోసం అరాచక శక్తులను ప్రశ్నిస్తూ రచనలు చేయాలి’ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కవులకు సూచించారు.
ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ‘తెలంగాణ భాషాదినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించారు. తొలుత సహచర మంత్రి మహమూద్ అలీతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కాళోజీ అవార్డును ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాళోజీ పలు కవితలను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కాళోజీ ప్రస్తావన లేకుండా ఏ సభ ఉపన్యాసం లేదంటే అతిశయోక్తికాదని, అంతగా ప్రభావితం చేశారని అన్నారు. కాళోజీ అవార్డును అందుకున్న శ్రీరామోజు హరగోపాల్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు.
ఉపాధ్యాయుడిగా, చరిత్ర పరిశోధకుడుగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా హరగోపాల్ పేరుపొందారని ప్రశంసించారు. వరంగల్‌లో కాళోజీ పేరిట ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నామని తెలిపా రు.కాళోజీ తన రచనల ద్వారా స్ఫూర్తిని నింపారని హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన హెల్త్ వర్సిటీకి కాళోజీ పేరుపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.
ఫాసిజాన్ని తరిమికొట్టాలె: గోరటి వెంకన్న
కులం, మతం పేరుతో మనల్ని విభజిస్తున్న ఫాసిజం పోకడలను తరిమికొట్టాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పిలుపునిచ్చారు. ఫాసిజాన్ని వ్యతిరేకించిన కాళోజీ.. ధిక్కారమే తన తత్వమని చాటుకున్నారని గుర్తుచేశారు. పురస్కార గ్రహీత హరగోపాల్ మాట్లాడుతూ కాళోజీ పేరి ట ఏర్పాటు చేసిన అవార్డును తాను స్వీకరించడం సంతోషంగా ఉందని అన్నారు.
పర్యాటక, సాంస్కృతిక, క్రీడలశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు దీపికారెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, అధికార భాషాసంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి, ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజ, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఘనంగా ఢిల్లీలో కాళోజీ జయంతి వేడుకలు
కాళోజీ జయంతి వేడుకలు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కేఎం సాహ్ని , తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.