హైదరాబాద్, మే25 (నమస్తే తెలంగాణ): భీమా, కృష్ణా నదులపై కర్ణాటక రాష్ట్రం ప్రతిపాదించిన బరాజ్‌ల నిర్మాణంపై విస్తృత చర్చల కోసం సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. విస్తృత చర్చల అనంతరం బరాజ్‌ల నిర్మాణంపై ముందుకు సాగుదామని తెలిపారు. భీమా నదిపై తంగడి గ్రామం వద్ద, కృష్ణా నదిపై కొల్పూర్ గ్రామం వద్ద ఇరు రాష్ర్టాలకు ఉపయోగంగా ఉండేలా కలిసి బరాజ్‌లను నిర్మించుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసింది. బరాజ్‌లను సంయుక్తంగా నిర్మిద్దామని ప్రతిపాదించింది.
వాటిపై చర్చించేందుకు కర్ణాటక రాష్ట్రం చిన్న నీటిపారుదల, సైన్స్, టెక్నాలజీ మంత్రి బోసు రాజు ప్రత్యేకంగా రాష్ర్టానికి సోమవారం విచ్చేశారు. సచివాలయంలో రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అవసరాలపై చర్చించారు. నీటివాటాలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, ఆయా బరాజ్‌ల నిర్మాణంపై విస్తృతంగా చర్చించేందుకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.