ఖైరతాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గడ్డపై ఆంధ్రా పార్టీ జనసేన రాజకీయం చేస్తూ ఏకంగా ఇక్కడి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో వారిని తరిమికొట్టారు. తెలంగాణ మేధావి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను టార్గెట్‌గా చేసుకొని ఏపీలో కేసులు పెట్టిన జనసేన నాయకులపై ఇప్పటికే తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. ఆ వివాదానికి మరింత ఆజ్యం పోస్తూ జనసేన నాయకులు ప్రవర్తించిన తీరుపై జర్నలిస్టులు మండిపడ్డారు. రాజకీయ విశ్లేషకుడిగా ఓ చర్చా కార్యక్రమంలో ఏపీ రాజకీయాలపై నాగేశ్వర్ వ్యాఖ్యానించటం, జనసేన నుంచి విమర్శలు రావటంతో అయన వెనక్కి తీసుకున్నారు.
కానీ ఏపీలో జనసేన ఫిర్యాదుతో కేసులు నమోదుచేయటాన్ని నిరసిస్తూ బుధవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా ఇంకా ఆంధ్రా పెత్తనం కొనసాగుతున్నదని, అక్కడి నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. దీనిపై జనసేన నాయకులు గురువారం ప్రెస్‌క్లబ్‌లో సమావేశంలో పెట్టారు. జనసేన పార్టీ తెలంగాణ ఇన్చార్జి నేమూరి శంకర్‌గౌడ్, నటుడు సాగర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలను ఖండించారు.
మరో నేత సంపత్‌నాయక్ మాట్లాడుతూ తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ అతిగా మాట్లాడుతున్నారని, పాశం యాదగిరి తదితరులపై తీవ్ర విమర్శలు చేశారు. జర్నలిజం ముసుగులో కారుకూతలు కూస్తున్నారని, ప్రొఫెసర్ నాగేశ్వర్ కొంతమంది చిల్లర బ్యాచ్గాళ్లతో ఏ విధంగా ప్రెస్‌మీట్ పెడుతారని ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న జర్నలిస్టులు మండిపడ్డారు. తోటి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యల చేయటంతో భగుగ్మన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించి వారిని ముట్టడించారు. దీంతె జర్నలిస్టుల మధ్య తీవ్ర వాగ్వాదం, తీవ్ర గందరగోళం నెలకొనడంతో జనసేన నాయకులు జర్నలిస్టుల నుంచి తప్పించుకొని పరుగులు పెట్టారు.