హైదరాబాద్: సర్వమత సమాదర భావానికి ఆలవాలంగా నిలిచిన దేశంలో నేడు విచ్ఛిన్నకర శక్తులు చెలరేగుతూ విద్వేషాగ్నులను రగిలిస్తున్నాయని, దేశాన్ని నిత్య రావణకాష్టంగా మారుస్తున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మతోన్మాద శక్తుల కుతంత్రాలతో భారతదేశానికి ప్రాణ వాయువుగా నిలిచిన “భిన్నత్వంలో ఏకత్వం” అనే జీవన సూత్రానికి ప్రమాదం ఏర్పడ్డదన్నారు. భారత రాజ్యాంగం అన్ని మతాలకు, సంస్కృతులకు సమాన ప్రతిపత్తిని కల్పించిందని, భారతదేశ పౌరులందరికీ సమాన హక్కులను, సమాన గౌరవాన్ని ఇచ్చేలా చేసిందని పేర్కొన్నారు. మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని, భారతీయ సంస్కృతికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బయలుదేరిన మతతత్వ శక్తులు భారతీయ సమాజంలోని ఏకత్వాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని అన్నారు.
పరమత సహనానికి పేరుగాంచిన భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ట పాలు చేస్తున్న మతోన్మాద శక్తులు ఇదేవిధంగా పెట్రేగిపోతే దేశ అంతర్గత ఐక్యత విచ్ఛిన్నమై పోతుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దేశం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా పతనమై పోతుందన్నారు. ఈ కల్లోలం ఇట్లే ప్రబలితే, అశాంతి ఇదేవిధంగా చెలరేగితే, దేశానికి రావాల్సిన అంతర్జాతీయ పెట్టుబడులు రాకపోగా, వచ్చిన పెట్టుబడులు సైతం వెనక్కు మళ్ళిపోయే విపత్కర పరిస్థితి దాపురిస్తుందని చెప్పారు. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దారులు మూసుకుపోతాయని, దేశ భవిష్యత్తు అంధకారంలోకి జారుకుంటుందని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైపోయిందని విమర్శించారు. అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికలలో గెలిచే సత్తా ఎటూ లేదు కనుక, ప్రజల దృష్టిని మళ్లించటం కోసం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే దుర్మార్గమైన ఎత్తుగడతో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. మన ముఖ్యమంత్రి చెప్పినట్లు ఈ విద్వేషకర వాతావరణం ఈ విధంగానే కొనసాగితే దేశం 100 సంవత్సరాలు వెనక్కు పోవడం ఖాయమన్నారు. దేశం ఒకసారి తిరోగమనం బాట పడితే, తిరిగి కోలుకోవడానికి మరో 100 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదని చెప్పారు. మతోన్మాద శక్తుల దుష్పరిపాలన వల్ల అటువంటి దుర్గతి మన దేశానికి పట్టకుండా ఉండాలంటే దేశ యువత వెంటనే కార్యక్షేత్రంలోకి దిగాలని బీఆర్ఎస్ విస్తృత సభ పిలుపునిస్తున్నదన్నారు.
మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్న ఆటవిక, అనాగరిక, అరాచక సంస్కృతిని రూపు మాపేందుకు, ద్వేషం స్థానంలో ప్రేమను, అసహనం స్థానంలో సామరస్యాన్ని, అలజడి స్థానంలో ప్రశాంతతను ప్రతిష్ఠించేందుకు భారతీయ పౌరులందరూ ఏకం కావాలని బీఆర్ఎస్ విస్తృత సభ తీర్మానిస్తున్నదని చెప్పారు. మన తర్వాత స్వాతంత్ర్యాన్ని పొందిన మన పొరుగు దేశమే అయిన చైనా బలీయమైన ఆర్థికశక్తిగా అవతరించి, యావత్ ప్రపంచాన్నే శాసించగల స్థాయికి చేరుకుందన్నారు.