హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దేవాలయాల్లో క్రమబద్ధంగా నిత్యకైంకర్యాలు, వేదపారాయణాలు, ఉత్సవాలు, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఖాళీగా ఉన్న 191 మతపరమైన పోస్టులను భర్తీ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో 47 ఆలయాలకు సంబంధించిన అర్చకులు, వేదపండితులు, పరిచారకులు, మృదంగం, డోలు, సన్నాయి, శృతి, తాళం విభాగాలవారు ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం వీరికి నియామక పత్రాలు అందజేశారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఆలయాల్లో ని అన్ని విభాగాల ఉద్యోగులకు వారి పనితీరును బ ట్టి అవార్డులు అందజేస్తామని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేప థ్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో వరుణయాగం నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
మతపరమైన 324 ఉద్యోగాల నియామకానికి నిరుడు నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలోని దేవాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఆ తర్వాత కోడ్ ముగియగానే హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఉన్న పలు దేవాలయాలలో పోస్టులకు కూడా ఎవరిదివారే నోటిఫికేషన్ ఇచ్చుకున్నారు. అలా మొత్తం 400 పోస్టుల భర్తీకి ప్రకటనలు ఇచ్చినప్పటికీ సగం ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. పలు దేవాలయాలకు ఉద్యోగుల ఎంపిక జరగలేదు. కొన్ని చోట్ల అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో ఆయా దేవాలయాల్లో నియామకాలు నిలిచిపోయాయి.
ఇంకొన్ని చోట్ల అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించినప్పటికీ వివరాలు ప్రకటించలేదు. దీంతో నియామకాల ప్రక్రియ పారదర్శకంగా జరిగితే వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటని, మిగిలిన ఉద్యోగాల సంగతేంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఆలయాల్లో జరిగిన నియామకాలపై మంత్రి సురేఖకుగానీ, ఆమె పేషీకి కానీ ఎలాంటి సమాచారం లేకుండా కొందరు ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే నడిచిందన్న చర్చ జరుగుతున్నది. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తుండటంపై మంత్రి సురేఖ ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది.