న్యూఢిల్లీ, జూలై 17 : మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ శుక్రవారం తమ నియంత్రణలో ఉన్న కంపెనీలను, స్టాక్ మార్కెట్లలో నమోదైన సంస్థలను హెచ్చరించింది. ‘బాస్ స్కామ్’గా పిలువబడుతున్న సైబర్ మోసాలపై అప్రమత్తం చేసింది. అక్రమార్కులు తమకు తాము ఆయా కంపెనీలకు సీఈవో/ఎండీ, ఇతర సీనియర్ అధికారులుగా చెప్పుకొని.. కింది స్థాయి ఉద్యోగులను నగదు పంపించమని ఆదేశాలు చేస్తుండటం ఇటీవలికాలంలో పెరుగుతున్న నేపథ్యంలోనే సెబీ పైవిధంగా స్పందించింది. ఇలాంటి మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని భారతీయ సైబర్ క్రైం కో-ఆర్డినేషన్ సెంటర్ నుంచి అలర్టులు రావడంతో సెబీ పలు సూచనలు చేసింది.
ఈ-మెయిల్, వాట్సాప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా మోసగాళ్లు ఆయా కంపెనీల బాస్లమంటూ కింది స్థాయి సిబ్బందికి సందేశాలు పంపి లేదా కాల్స్ చేసి కొన్ని బ్యాంక్ ఖాతాల్లో నగదు బదిలీ చేయించుకుంటున్నారని వివరించింది. వాయిస్ క్లోనింగ్, డీప్‌ఫేక్ వీడియో కాల్స్ వంటి ఏఐ (కృత్రిమ మేధస్సు) సాధనాలనూ కేటుగాళ్లు వాడి అమాయకులను దోచేస్తున్నారని చెప్పింది. అలాగే హానికరమైన సాఫ్ట్‌వేర్‌తో కూడిన జిప్ ఫైల్‌ను పంపించి బాధితుల బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారని, అలాంటి ఫైల్స్ వస్తే వాటి జోలికి వెళ్లవద్దని కూడా సూచించింది.
ఇకపై డీమ్యాట్ రూపంలో పెట్టుకున్న మ్యూచువల్ ఫండ్ యూనిట్ల కోసం కూడా మదుపర్లు సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్లు (ఎస్‌డబ్ల్యూపీలు), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ల (ఎస్టీపీలు)కై స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఈ మేరకు శుక్రవారం సెబీ అనుమతిచ్చింది. ప్రస్తుతం స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ రూపం లో ఉన్న మ్యూచువల్ ఫండ్ యూనిట్ల కోసమే ఇన్వెస్టర్లకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు లేదా తమ రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్ల ద్వారా ఈ అవకాశం ఉన్నది.
మదుపరి చనిపోయాక తన మ్యూచువల్ ఫండ్ యూనిట్ల బదిలీ కోసం జరిగే ప్రక్రియను భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) శుక్రవారం సులభతరం చేస్తున్నట్టు ప్రకటించింది. నామినీలు, చట్టపరమైన వారసుల కోసం క్లెయిమ్‌ల ప్రక్రియను సులభతరం చేయాలన్న సెబీ సూచనతో యాంఫీ ఆ మేరకు చర్యలు చేపట్టింది. బదిలీ ప్రక్రియలో చనిపోయిన మదుపరి చిరునామా, పేరు, సంతకాల్లో తేడాల వంటి తరచూ ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం డ్యాకుమెంటేషన్‌ను సులువు చేస్తూ సవరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్‌ను తెచ్చింది. ఈ మార్పులు వెంటనే అమల్లోకి రానున్నాయి.