వరంగల్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పదేండ్ల కేసీఆర్ పాలనలో వివిధ పథకాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా పలు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు. రాజకీయంగా, అటు ప్రభుత్వ పరంగా మహిళలకు అద్వితీయమైన అవకాశాలు కల్పించారు. కల్యాణలక్ష్మీ/ షాదీముబారక్, ఆసరా పెన్షన్, కేసీఆర్‌కిట్, కేసీఆర్ న్యూట్రిషియన్కిట్, ఆరోగ్యలక్ష్మీ, అమ్మఒడి, షీ-టీమ్స్, భరోసా కేంద్రా లు, సఖీ కేంద్రాలు ఇలా అనేక పథకాలు, కార్యక్రమాలకు మహిళల సంక్షేమమే కేంద్ర బిందువుగా పనిచేసింది. రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లకు దేవతల పేర్లు పెట్టడం విశేషం. సమ్మక-సారలమ్మ బరాజ్, లక్ష్మీ, సరస్వతీ పంప్‌హౌస్‌లు ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇచ్చి న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా మహిళల పేరుతోనే మం జూరు చేశారు. మహిళా సాధికారత, స్వ యంశక్తి, ఆత్మగౌరవానికి కేసీఆర్ హయాంలో అధిక ప్రాధాన్యం ఇచ్చారనడానికి ఇవన్నీ ఉదాహరణలే.
భూమిలేని వ్యవసాయ కుటుంబాలైన పేద ఎస్సీ మహిళా లబ్ధిదారులకు నూటికి నూరుశాతం సబ్సిడీతో ఒక పంట సంవత్సరానికి పంటసాయంతోపాటు 3 ఎకరాల భూమిని అందించాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. 17,097.09 ఎకరాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్రంలో 6,998 మందికి పంపిణీ చేసింది. ఈ పథకం కింద రూ.769.17 కోట్లు కేసీఆర్ సర్కార్ ఖర్చుచేసింది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, ఎస్సారెస్పీ పునరుజ్జీవంతో సాగువిస్తీర్ణం, బీడుభూములు సాగుయోగ్యంగా మారడమే కాకుండా భూముల ధరలు విపరీతంగా పెరుగడంతో నాడు కేసీఆర్ సర్కార్‌కు భూసేకరణ అత్యంత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గాలను అభ్యున్నతిలోకి తీసుకొనిరావడానికి మరోమార్గంగా దళితబంధు పథకానికి కేసీఆర్ రూపకల్పన చేశారు.
మాతా, శిశు సంరక్షణకు కేసీఆర్ హయాంలో పెద్దపీటవేశారు. గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్ అనే విప్లవాత్మకమైన పథకాన్ని అమలు చేశారు. 2022 డిసెంబర్ 21వ తేదీన తొమ్మిది జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో న్యూట్రిషియన్ కిట్లను పంపిణీ చేశారు. అత్యధికంగా ఎనీమియా (రక్తహీనత) ప్రభావం ఉన్న తొమ్మిది జిల్లాలైన ఆదిలాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, జయశంకర్-భూపాలపల్లి, జోగుళాంబ-గద్వాల, కామారెడ్డి, కుమ్రం భీం-ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఈ పథకాన్ని మొదట అమలు చేసి, ఆ తరువాత 24 జిల్లాలకు విస్తరించారు. దేశంలో మరెక్కడాలేని విధంగా ఈ పథకం విజయవంతంగా అమలైంది. అయితే, ఇలాంటి మహత్తర పథకాన్ని సైతం రేవంత్‌రెడ్డి సర్కార్ అటకెక్కించింది.
కేసీఆర్ హయాంలో ఆశావర్కర్లకు ఆకాశసదృశ్య గౌరవస్థానం లభిస్తే, నేడు రేవంత్ సర్కార్‌లో వారిని పాతాళానికి తొక్కేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని అడిగేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి బయలుదేరిన ఆశా వర్కర్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గరికి వెళ్తుంటే, అర్ధరాత్రీఅపరాత్రి అనకుండా పోలీస్ స్టేషన్లకు తరలించి నిర్బంధిస్తున్న దయనీయ వాతావరణం నెలకొన్నది. ఇదే ఆశావర్కర్లు అడుగకపోయినా సరే నాడు కేసీఆర్ వారికి గౌరవ వేతనాన్ని దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా పెంచారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో ఆశావర్కర్లకు చెల్లించే గౌరవ వేతనం కేవలం రూ.2,000 ఉండేది. ఈ మొత్తాన్ని కేసీఆర్ రూ.9,750కి పెంచారు. ఇదే ఆశావర్కర్లకు ప్రస్తుతం మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో రూ.3,000, గుజరాత్లో రూ.6,700, కర్ణాటక, హర్యానాల్లో రూ. 4,000, కేరళలో రూ. 5,000 మాత్రమే చెల్లిస్తున్నారు.
రాజకీయంగా మహిళలు ఎదగాలన్న ఉద్దేశంతో వారికి అప్పటిదాకా స్థానిక సంస్థల్లో ఉన్న 33% రిజర్వేషన్లను 50 శాతానికి పెంచారు. ఇలాంటి విప్లవాత్మక చర్యలు తీసుకోవడం వల్ల మున్సిపల్ చైర్పర్సన్లుగా, జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్లుగా, మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎంతోమంది మహిళలు స్థానిక పరిపాలనలో భాగస్వాములయ్యారు. అలాగే, మండలస్థాయిలో ఎంపీపీ, జడ్పీటీసీలుగా పట్టణాలు, నగరాల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్‌గా వేలాది మంది మహిళలు తమ రాజకీయశక్తిని ప్రదర్శించి సమాజ నిర్మాణంలో తమ వంతుపాత్ర పోషించారు. రాజకీయంగా మహిళలకు ప్రత్యక్ష అవకాశాలు రానిచోట వారి సేవలు వినియోగించుకోవడమే కాకుండా వారికి సముచిత గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో నాడు కేసీఆర్ మార్కెట్ కమిటీల్లో మహిళలకు అవకాశం కల్పించారు. మార్కెట్ కమిటీ, దేవాదాయ, ధర్మాదాయ కమిటీల్లో వారికి 33% రిజర్వేషన్లు కల్పించి విజయవంతంగా అమలు చేశారు. మున్సిపల్, నగర, మహానగర పాలక సంస్థలు ఓపెన్ క్యాటగిరీలో ఉన్నప్పటికీ, అనేక స్థానాలను మహిళలకు కేటాయించిన సందర్భాలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కేసీఆర్ సారథ్యంలో కొలువుదీరిన సర్కార్ పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆర్థికసాయం అందించే లక్ష్యంతో కల్యాణలక్ష్మీ పేరుతో వినూత్న, మానవీయ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని ముందుగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రమే పరిమితం చేసినప్పటికీ, ఆ తరువాత ఇతర వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోనికి తీసుకొని అన్నివర్గాలకు విస్తరించారు.
ఈ పథకం కింద తొలుత రూ.51,116 ఆర్థిక సహాయం అందించగా, ఆ తరువాత రూ.75,166, ఆ తరువాత రూ.1,00,116కు పెంచారు. ఈ పథకం కింద 2014 నుంచి 2023 మే మధ్యకాలంలో రాష్ట్రంలో 12,71,839 మందికి ప్రయోజనం కలిగింది. ఇందులో 1,25,145 మంది దివ్యాంగులు ఉండగా, షాదీముబారక్ ద్వారా 2,55,518 మంది మైనారిటీ ఆడబిడ్డల ఇండ్లల్లో కల్యాణకాంతులు వెల్లివిరిశాయి. ఈ పథకం కింద నాడు కేసీఆర్ సర్కార్ రూ.11,130 కోట్లు ఖర్చుచేసింది. కేసీఆర్ ముందుచూపుతో అమలు చేసిన ఈ పథకం ఆర్థికంగా ఆసరానందించే అంశంగానే కాకుండా సామాజిక బాధ్యతనూ నిర్వర్తించింది. ఈ పథకం ద్విముఖ ఫలితాలను సాధించింది. 2011-2014 మధ్యకాలంలో తెలంగాణలో బాల్యవివాహాలు 56% కాగా, వాటిని ఒకే అంకెకు కుదించగలిగాయని అనేక సామాజిక గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ పాపులర్ పథకాన్ని కాంగ్రెస్ అట్టర్‌ప్లాఫ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ పథకం కింద నగదుతోపాటు తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పింది.

బీడీలు చుట్టడమే జీవనాధారంగా బతుకుతున్న రాష్ట్రంలోని 4,25,793 మంది కార్మికులకు ఆసరాగా నిలువాలన్న ఉద్దేశంతో నాడు కేసీఆర్ సర్కార్ వారికి నెలకు రూ. 2,016 చొప్పున పింఛన్లు అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలో బీడీ కార్మికుల కోసం పింఛన్లు అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒక కుటుంబంలోని ఇతర సభ్యులు పింఛన్లు పొందుతున్నప్పటికీ, అదే కుటుంబంలో పీఎఫ్ ఖాతా కలిగిన బీడీ కార్మికులందరికీ పింఛన్ల సౌకర్యం కల్పించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం.

అనేకానేక కారణాలతో ఒంటరిగా జీవిస్తూ, సమాజంలో అవమానాలు, అగౌరవానికి గురవుతున్న పలువురు మహిళలకు కేసీఆర్ హయాం నుంచి గౌరవం దక్కింది. ఒంటరి మహిళలకు నెలనెలా రూ.2,016 ఆర్థికసాయం అందించాలన్న ఉద్దేశంతో ఆసరా పింఛన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్రంలో 1,43,930 మంది ఒంటరి మహిళలు లబ్ధిపొందారు.
గర్భిణులు, శిశువులను కేసీఆర్ సొంత మేనమామలా చూసుకున్నారు. ఆడబిడ్డ గర్భందాల్చినప్పటి నుంచి ప్రసూతి వరకు ఇంటి నుంచి దవాఖానకు తీసుకెళ్లడం, తిరిగి దవాఖాన నుంచి ఇంటికి చేర్చడం అనే మానవీయ నిర్ణయాన్ని కేసీఆర్ హయాంలో తీసుకోవడం వల్ల రూ.18,46,635 మందికి లబ్ధి చేకూరింది. అమ్మఒడి అనే పేరుతో పిలిచిన ఈ పథకం గర్భిణులు, శిశువులకు అమ్మ ఒడిలాగే సేవలు అందించిందని తెలంగాణకు పేరొచ్చిచ్చింది.

కేసీఆర్ అమలు చేసిన ఆరోగ్యలక్ష్మీ, కేసీఆర్ కిట్, బాలామృతం, బాలామృతం ప్లస్, వంటి పథకాల ద్వారా తెలంగాణలో మాతృమరణాలు గణనీయంగా తగ్గాయని అధ్యయనాలు నిరూపించాయి. 2014లో మాతృమరణాల రేటు తెలంగాణలో లక్షకు 92 ఉంటే, 2022 నాటికి 56కు తగ్గింది. జాతీయ సగటు 103 ఉండటం గమనార్హం.

ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకునే మహిళలకు తగిన ఆర్థిక సహాయం అందించడంతోపాటు తల్లీబిడ్డలకు అవసరమైన వస్తువులను ఉచితంగా అందించే కేసీఆర్ కిట్ పథకాన్ని 2017 జూన్ 2న కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. గర్భిణులు, బాలింతల సంక్షేమమే లక్ష్యంగా తెచ్చిన ఈ పథకం ద్వారా అర్హులైన వారికి మూడు విడతలుగా మొత్తం రూ.12 వేలను ప్రభుత్వం అందించింది. వారు ఆడపిల్లకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా మరో రూ.1,000 కలిపి రూ.13వేలు అందించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. బాలింత, శిశుమరణాలు తగ్గాయి. భ్రూణహత్యలు లేకుండా పోయాయి. కేసీఆర్ హయాంలో ఈ పథకం కింద 13,90,636 మందికి కేసీఆర్ కిట్ చేరింది. ఇటువంటి మానవీయ పథకాన్ని రేవంత్ సర్కార్ కాలరాసింది.

తరతరాలుగా వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాలకు ఆర్థిక గౌరవంతోపాటు సామాజిక గౌరవాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే దిక్సూచిగా కేసీఆర్ నిలుపాలని చూశారు. దేశంలో మరే రాష్ట్రం కనీస ఊహకు అందని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఎలాంటి బ్యాంకు లింకేజీ, సెక్యూరిటీగానీ లేకుండా, లబ్ధిదారు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే రూ.10 లక్షల గ్రాంటును ఉచితంగా అందజేసింది.
దళితులను స్వయం సమృద్ధిని సాధించి, వ్యాపార వర్గాలుగా తీర్చిదిద్దేందుకు నాడు కేసీఆర్ సర్కార్ సంకల్పించింది. ప్రాథమిక దశలో ఈ పథకం కింద 38,323 మంది అర్హులను గుర్తించి వారికి రూ.3,832.3 కోట్లు ఖర్చుచేసింది. ఈ పథకం కింద ఎంపికైన యూనిట్లను సైతం మహిళల పేరుతోనే మంజూరుచేసింది. దళితబంధు పథకాన్ని కొనసాగించడమే కాకుండా ఈ పథకం కింద కేసీఆర్ ఇచ్చే రూ.10 లక్షలకు బదులుగా రూ.12 లక్షలు చెల్లిస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసింది. కొత్తది ఇవ్వకపోగా ఉన్న పథకాన్ని నామరూపాల్లేకుండా చేస్తున్నది.
దేశంలో మరే రాష్ట్రంలోలేని విధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కేసీఆర్ హయాంలో మూడుసార్లు గౌరవ వేతనం పెంచారు. అది రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఉన్న వేతనంతో పోలిస్తే పెంచిన వేతనం 300% అధికం. నాడు కేసీఆర్ సర్కార్ పెంచిన గౌరవ వేతనమే ప్రస్తుతమూ కొనసాగుతున్నది. తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకు ప్రస్తుతం వేతనం రూ.13,650 ఉంటే, బీజేపీ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్‌లో రూ.7,000, రాజస్థాన్‌లో రూ. 7,500, మహారాష్ట్రలో రూ.8,325 మాత్రమే ఉండటం గమనార్హం.
తల్లీబిడ్డలు, గర్భిణుల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా కేసీఆర్ సర్కార్ 2015 జనవరి 1వ తేదీ నుంచి ‘ఆరోగ్య లక్ష్మీ’ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని దాదాపు 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో సంపూర్ణ పౌష్టికాహారం అందించింది. దేశవ్యాప్తంగా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో తల్లీబిడ్డలు, గర్భిణుల కోసం కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 6 ఖర్చు చేస్తే, కేసీఆర్ సర్కార్ నాడు రూ.22 ఖర్చుచేసింది. ఈ పథకాన్ని 11 రాష్ర్టాల ప్రతినిధుల బృందాలు అధ్యయనం చేసి అనంతరం వారి వారి రాష్ర్టాల్లో అమలు చేశారు. 2014-15 సంవత్సరం నుంచి కేసీఆర్ హయాంలో ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 35,80,656 మందికి లబ్ధి చేకూరింది.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే 2015లో చేపట్టిన సివిల్ పోలీసు ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33%, ఏఆర్ పోలీసు నియామకాల్లో 10% రిజర్వేషన్లను కేసీఆర్ సర్కార్ కల్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అవస్థలుపడిన గ్రేడ్-2 సూపర్వైజర్లను కేసీఆర్ హయాంలో క్రమబద్ధీకరించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 142 మందికి అవకాశం లభించింది. అలాగే, మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో కేసీఆర్ అంకుర సంస్థలకు ప్రోత్సాహం కల్పించారు. వీ-హబ్‌లో వారికి సముచిత స్థానం కల్పించారు. అంగన్వాడీ కేంద్రాలను సమర్థంగా నిర్వహించేందుకు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న 2,356 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను నాడు కేసీఆర్ సర్కార్ భర్తీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 568 సూపర్వైజర్ పోస్టులను సైతం భర్తీ చేసింది.
మహిళా సాధికారత కోసం కేసీఆర్ సర్కార్ తీసుకున్న చర్యలను నీతి ఆయోగ్ కీర్తించింది. 2021-22 నీతి ఆయోగ్ నివేదికలో దేశంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని ప్రశంసించింది. ఆ నివేదిక ప్రకారం దేశంలో 12.39 (20.37%) మిలియన్ల మంది మహిళలు ఎంఎస్ఎంఈల్లో వివిధ రంగాల్లో ఉన్నారు. తెలంగాణలో ఎంఎస్ఎంఈల్లో ఎస్సీలు 14.94%, ఎస్టీలు 8.7%, ఓబీసీలు 27.69%, జనరల్ క్యాటగిరీల్లో 48.62% ఉన్నారని పేర్కొనడం గమనార్హం.
బీఆర్ఎస్ పార్టీ పరంగా మహిళలకు అనేక అవకాశాలను కేసీఆర్ కల్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షులుగా మహిళలను నియమించడమే కాకుండా తెలంగాణ ఆవిర్భవించిన రెండు టర్మ్‌ల్లో ఇద్దరు మహిళలను బీఆర్ఎస్ లోక్‌సభకు పంపింది. అలాగే, కేసీఆర్ రెండో టర్మ్‌లో అతికీలకమైన విద్య, స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖలను మహిళలకు అప్పగిస్తే వారు ఆయా శాఖలను సమర్థంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పలువురు మహిళలకు అవకాశం కల్పించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరారాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కేసీఆర్ మహిళకు కేటాయిం చి, గెలిపించుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కొలువుదీరిన రా ష్ట్రం తొలి శాసనసభ డిప్యూటీ స్పీకర్ (క్యాబినెట్ హోదా) స్థానాన్ని మహిళకే కేటాయించడం గమనార్హం.
స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీగా మహిళలకు చట్టపరంగా 50% రిజర్వేషన్లు కల్పించడమే కాదు, అంతకన్నా ఎక్కువ స్థానాలను కేటాయించిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుంది. గత జీహెచ్ఎంసీ మేయర్ పీఠం జనరల్‌కు కేటాయించారు. అయితే, ఈ స్థానాన్ని మహిళకు అందునా బీసీ మహిళకు అవకాశం కల్పించిన ఘనత కేసీఆర్‌దే. డిప్యూటీ మేయర్ స్థానాన్ని కూడా మహిళకే కేటాయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ల ప్రకారం 75 స్థానాలు మహిళలకు కేటాయించాలి. కానీ, బీఆర్ఎస్ పార్టీ దాదాపు 60% కార్పొరేటర్ స్థానాలను మహిళలకు కేటాయించి రికార్డు సృష్టించింది.
ఆరోగ్యలక్ష్మీ 35,80,656
వితంతు పెన్షన్లు 15,73,050
ఒంటరి మహిళా పెన్షన్లు 1,43,930
బీడీ కార్మికులు 4,25,793
కల్యాణలక్ష్మీ/షాదీముబారక్ 12,71,839
కేసీఆర్ కిట్స్ 13,90,636
కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్ 6,25,940
హెల్త్ హైజనిక్ కిట్ 11,32,231
దళితబంధు 36,204