రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం సంక్షేమ పథకాలకే
రూ.35,285 కోట్ల నుంచి రూ.93,489 కోట్లకు
వార్షిక వ్యయంలో సగటున 56.85 % ఖర్చు
హైదరాబాద్, ఏప్రిల్ 3 : తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మరే రాష్ట్రం కనీసం ఆలోచనైనా చేయలేని విప్లవాత్మక పథకాలకు తెలంగాణ ప్రయోగశాలగా మారింది. అన్ని రాష్ర్టాలకు అధ్యయన కేంద్రంగా భాసిల్లుతున్నది.. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం తన నిధుల్లో సింహభాగాన్ని సంక్షేమ రంగంపైనే ఖర్చు చేస్తున్నది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తన వెబ్సైట్లో పొందుపరిచిన నివేదికలోని గణాంకాలివి. ఏదైనా అంశాన్ని అధ్యయనంచేయడానికి కానీ, సగటు లెక్కించడానికి కానీ ఐదేండ్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకొంటారు.
ఇదే విధానాన్ని అనుసరిస్తూ ‘కాగ్’ 2016-17 నుంచి 2020-21 వరకు ఐదేండ్ల వ్యవధిలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయాలను పరిగణనలోకి తీసుకొన్నది. 2021-22 వాస్తవిక అంచనాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో వస్తాయి. 2022-23 బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తే సంక్షేమరంగంపై గడిచిన ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం 56.85%. రాష్ట్రం చేసిన వ్యయాన్ని 4 క్యాటగిరీలుగా విభజించి సోషల్ సర్వీసెస్ (సంక్షేమ రంగం), ఎకనామిక్ సర్వీసెస్ (ఆర్థిక సేవలు), డెబిట్ సర్వీసింగ్ (రుణ లావాదేవీలు), జనరల్ సర్వీసెస్ (సాధారణ సేవలు)గా కాగ్ విశ్లేషించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో సంక్షేమరంగంపై రూ.35,285 కోట్లు ఖర్చుచేసిన తెలంగాణ 2020-21 ఆర్థిక సంవత్సరంలో దీనిని రూ.48,400 కోట్లకు తీసుకెళ్లింది. తాజాగా 2022-23 ఆర్థిక సంవత్సరంనాటికి రూ.93,489 కోట్లకు తీసుకెళ్లింది. ఈ విషయంలో మరే రాష్ట్రమూ తెలంగాణకు దరిదాపుల్లోనూ లేదు.