హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): వర్తమాన, సామాజిక అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి తన అజ్ఞానాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో శనివారం ఓంకారేశ్వరస్వామి ఆలయం పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సముద్ర తీరం ఉన్న రాష్ర్టాల్లోని నగరాలు వ్యాపార కేంద్రాలుగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. దేశంలో సముద్ర తీరం ఉన్న రాష్ర్టాలు కేవలం తొమ్మిదే కదా.. మిగిలిన రాష్ర్టాలు సముద్రానికి ఆనుకొని లేవు కదా అని చర్చించుకున్నారు.
ప్రభుత్వ వార్తలను మీడియాకు పంపించే ఐ అండ్ పీఆర్ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అన్నవి అన్నట్టుగా గ్రూప్‌లలో షేర్ చేయడం గమనార్హం. దీంతో సీఎం వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్న రేవంత్‌రెడ్డి ఆ ఒరవడిని మరోసారి కొనసాగించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎక్కడ సభలు, సమావేశాల్లో పాల్గొన్నా ఏదో అంశానికి కొత్త నిర్వచనం చెప్తూ ప్రజల్లో చులకన అవుతూనే ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు. అవగాహన లేని విషయాలను అంతా తనకే తెలుసునన్నట్టుగా మాట్లాడటం.. అభాసుపాలు కావడం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందంటూ సెటైర్లు వేస్తున్నారు.