సమయం వచ్చినప్పుడు గేర్ మారుస్తం.. తెలంగాణ కథలో నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే.. కాంగ్రెస్ ఫస్ట్‌హాఫ్ డిజాస్టర్.. సెకండాఫ్ కూడా అంతే.. కేసీఆర్ కంటే దేశంలో ఎవరు ఎక్కడ ఎక్కువ పనులు చేసినట్టు చూపించినా రాజకీయాల నుంచి తప్పుకొంటా! – కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో పాల్గొని అనేక విషయాలను పాత్రికేయులతో పంచుకున్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమ ప్రస్థానం, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పాలనాపగ్గాలు చేపట్టాక బీఆర్ఎస్ సాధించిన విజయాలను వివరిస్తూనే ప్రస్తుత కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై ప్రజలను జాగృతపరుస్తూనే ‘మన తాతల కథ.. తండ్రుల కథ.. మన జాతి కథను ఉడుకునెత్తురుతో ఉరకలెత్తే యువతరం తెలుసుకోవాలి.. పుట్టిన గడ్డ.. జన్మనిచ్చిన మట్టి కథను యువత చదువుకోవాలి’ అని పిలుపునిచ్చారు.
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజకీయాల్లో అసలైన ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ముమ్మాటికీ కేసీఆరేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. కేసీఆర్ ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావాలో, రాజకీయంగా ఎప్పుడు గేర్ మార్చాలో తమకు బాగా తెలుసని చెప్పారు. రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లకు సమాధానం చెప్పడానికి తమ లాంటి క్షేత్రస్థాయి నాయకత్వం చాలని చురకలంటించారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన పాత్రికేయులు అడిగిన పలు పదునైన ప్రశ్నలకు తనదైన శైలిలో స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. 2027లో తాను చేపట్టబోయే రాష్ట్రవ్యాప్త పాదయాత్రను ప్రకటిస్తూనే.. రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్-బీజేపీ ‘హైబ్రిడ్ జోడీ’ ప్రభుత్వమని విమర్శించారు. రాబోయే రోజుల్లో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పూర్తిగా బొందపెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యపై స్పందిస్తూ రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రెస్‌క్లబ్‌తో కలిపి జాయింట్ కమిటీ వేసి, జర్నలిస్టులు కోరుకున్న ప్రైమ్ ల్యాండ్‌లోనే ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నలు.. కేటీఆర్ ఇచ్చిన సమాధాలు ఇలా.. ప్రశ్న: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిన్న మాట్లాడుతూ ‘నన్ను ఎవరు అడ్డుకుంటారు? తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?’ అని వ్యాఖ్యానించారు. ఏపీలో జనసేన కార్యకలాపాలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నదని పరోక్షంగా ప్రస్తావించారు.
దీనిపై మీ స్పందన ఏమిటి? కేటీఆర్: ప్రజాస్వామ్య భారతదేశంలో బాబాసాహెబ్ అంబేదర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఏ నాయకుడైనా, నాయకురాలైనా నిరభ్యంతరంగా ఎకడైనా పార్టీ పెట్టవచ్చు. ఏ రాష్ట్రంలోనైనా పోటీ చేయొచ్చు. అది అందరి హకు. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ, మీరు ఏ ప్రాంతంలో రాజకీయం చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ఆకాంక్షలు, పరిస్థితులు, అకడి ప్రజల మానసిక స్థితిగతులు, వారి పోరాటాలు, త్యాగాల గురించి కనీస అవగాహన ఉండాలి, వారిపై అభిమానం ఉండాలి. పవన్ కల్యాణ్‌ను నేను అడుగుతున్నా.. ఇవాళ మీరు కొత్తగా తెలంగాణలో పోటీ చేసేది ఏమున్నది? జనసేన పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదా? మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో 350 వార్డుల్లో పోటీ చేయలేదా? మిమ్మల్ని అసలు ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు వచ్చారు, పోటీ చేశారు. 2023లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవరు వద్దన్నారు?
తెలంగాణ కచ్చితంగా భూమి పుత్రుల జాగీరే!
పవన్‌కల్యాణ్ ఇకడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. తెలంగాణ ఏదో ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. అనాయాసంగా వచ్చిన నేల కాదు. వేల మంది బలిదానాలతో, రక్తంతో తడిసిన నేల ఇది. నిన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఎవరో అడ్డుకుంటున్నట్టు ఒక ఊహాజనిత ప్రపంచాన్ని సృష్టించుకొని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని 2018లో అడ్డుకోలేదు, 2023లోనూ అడ్డుకోలేదు. ప్రజలు మిమ్మల్ని తిరసరిస్తే (అడ్డుకుంటే) దానికి మేమేం చేస్తాం? ఇక ‘మీ అయ్య జాగీరా’ అన్న వ్యాఖ్యకు వస్తే.. నేను పవన్ కల్యాణ్‌కు ఒకటే గుర్తు చేస్తున్నా. తెలంగాణ కచ్చితంగా ఈ ప్రాంత భూమిపుత్రుల జాగీరే! ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అకర్లేదు.
రండి వ్యాపారాలు చేసుకోండి
మీరు ఇకడికి రండి, ఉండండి. మీ కుటుంబాలు ఇకడే ఉన్నయి.. మీ వ్యాపారాలు ఇకడే ఉన్నయి. గత పది, పన్నెండేండ్లలో ఎకడైనా చిన్న సమస్య వచ్చిందా? ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలనేదే మా దృక్పథం. అందుకే మోదీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తుంటే మేము స్వయంగా వెళ్లి ప్రైవేటీక రణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి మద్దతు తెలిపి, పబ్లిక్ సెక్టార్ సంస్థలను కాపాడాలని డిమాండ్ చేసినం. అది మా ఫిలాసఫీ.
పొట్టి శ్రీరాములుది ప్రాంతీయవాదమా?
నిన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అన్నట్టుగా మాట్లాడారు. నేను ఆయనకు గుర్తు చేస్తున్నా.. ఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టిశ్రీరాములు 58 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆత్మబలిదానం చేసుకున్నారే.. మరి దాన్ని కూడా ప్రాంతీయవాదం అంటారా? ఇంకో మాట.. జాతీయవాదం ముసుగులో జరుగుతున్న ఆర్థిక ప్రాంతీయవాదం గురించి పవన్‌కల్యాణ్ సమాధానం చెప్తారా? మా హయాం లో తెలంగాణకు రావాల్సిన కేస్ అనే పరిశ్రమను, మైక్రాన్ అనే సంస్థ పెట్టుబడుల్ని మోదీ ఇకడి నుంచి గుజరాత్‌కు పట్టుకుపోయారు. మోదీ కేవ లం గుజరాత్‌కే ప్రధానిగా వ్యవహరించడం కరెక్టా? దీనికి పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి.
దేశభక్తి పాఠాలు మాకు అకర్లేదు
ఇంకొన్ని రోజులైతే తెలంగాణలో జనగణమన కూడా పాడరనే విధంగా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. దేశభక్తి గురించి, జాతీయ భావాల గురించి మేము పవన్ కల్యాణ్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సరార్కు వ్యతిరేకంగా పోరాడిన నేల. కమ్యూనిస్టులు కదం తొకిన నేల. మాకు పోరాటాలు, యుద్ధాలు, త్యాగాలు కొత్త కాదు. ఈ దేశానికి మా వంతు సహకారం మేము అందిస్తున్నం. జనాభా పరంగా భారతదేశంలో మేము 3 శాతం కంటే తకువే ఉన్నా, దేశ జీడీపీకి 5 శాతం కంటే ఎకువ కాంట్రిబ్యూట్ చేస్తున్నం. కాబట్టి మాకు ఎవరి నుంచో మోరల్ లెక్చర్స్ లేదా మోరల్ పోలీసింగ్ అవసరం లేదు.
ఓజీ కేసీఆరే
పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మేము డెఫినెట్‌గా గౌరవిస్తం. ఒక నటుడిగా, కళాకారుడిగా అభిమానిస్తం. ఒక సోదరుడిగా మా ఇంటికి వస్తే అద్భుతమైన హైదరాబాదీ బిర్యానీ పెట్టి సతరిస్తం. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తామంటే కుదరదు. 60 ఏండ్లు పోరాడి, ఎంతో కష్టపడి 2014లోనే మేము వేరుపడ్డం. ఈ మధ్యనే పవన్ కల్యాణ్ ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) సినిమా వచ్చింది కదా.. నేను నా బ్రదర్ పవన్ కల్యాణ్‌కు ఒకటే గుర్తు చేయాలనుకుంటున్నా.. తెలంగాణకు ఒకే ఒక ఓజీ ఉన్నారు. ఆయనే కేసీఆర్. ఇకడ మా కేసీఆర్ ఉన్నారు. ఆయన చాలు మాకు. ఆయనే మమ్మల్ని, మా రాష్ర్టాన్ని, మా సమస్యలను చూసుకుంటారు.
ప్రశ్న: పదేండ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధేమిటి?
కేటీఆర్: గత పదేండ్ల్లలో భారతదేశంలో తెలంగాణ సాధించిన విజయాలు, నెలకొల్పిన మైల్‌స్టోన్స్ అపూర్వమైనవి, సాటిలేనివి. ఏ ఇండికేటర్ తీసుకున్నా తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. నేను ఐటీశాఖ మంత్రిగా కూడా పనిచేశాను కాబట్టి పూర్తి బాధ్యతతో చెప్తున్నా. ఒక్క ముకలో చెప్పాలంటే స్వతం త్ర భారత చరిత్రలో తెలంగాణ అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్. కేవలం దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించినంత ప్రగతి దేశంలో మరే రాష్ట్రం కూడా సాధించలేదు.
ప్రశ్న: బాల సుమన్ వ్యాఖ్యలపై స్పందనేంటి?
కేటీఆర్: మా పార్టీ పంథా ఏమాత్రం మారలేదు. ఒక చుక రక్తం చిందించకుండా, శాంతియుత, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తెలంగాణ సాధించాలని కేసీఆర్ నాడు చెప్పారు. నేడూ మేము అదే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నం. బాల సుమన్ మాటల విషయానికి వస్తే.. ఆయన డెఫినెట్‌గా పొరపాటుగానే మాట్లాడారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయన బహుశా మిలిటెన్సీ స్పిరిట్ (పోరాట పటిమ)తో పని చేయాలని అని ఉంటారు తప్ప, హింసాత్మక పోరాటాలు చేయాలని అని ఉండరు. ఒకవేళ ఆయన నిజంగా మిలిటెంట్ పోరాటాల గురించే మాట్లాడి ఉంటే అది 100 శాతం తప్పే. ఆ వ్యాఖ్యలతో ఏకీభవించే సమస్యే లేదు.
చట్టం అందరికీ సమానంగా ఉండాలి
దేశంలో చట్టం, లా అండ్ ఆర్డర్ అనేవి సెలెక్టివ్‌గా ఉండకూడదు. బాల సుమన్ అన్న మాటలకు ఆయనపై కేసు పెట్టి జైల్లో పెట్టారు. మరి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్ ఆఫీస్‌ను, కేసీఆర్ గజ్వేల్ క్యాంప్ హౌస్‌ను తగులబెడుతామంటే కేసులు ఎందుకు పెట్టలేదు? ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఫార్మా కంపెనీని తగులబెడుతామన్నా, మరొకరు చెయ్యి నరికేస్తానన్నా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? స్వయంగా ముఖ్యమంత్రే బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని పిలుపునిచ్చారు. అది హింస కాదా? కేసీఆర్ చావును కోరుకుంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడే రోత భాషపై ఎన్ని కేసులు పెట్టాలి? కాంగ్రెస్ వాళ్లు ఏం చేసినా చెల్లుతుంది.. ఇతరులు మాట్లాడితే జైల్లో పెడుతామంటే కుదరదు. చట్టం అందరికీ ఒకటే ఉండాలి.
రాబోయే ఎన్నికలకు బీఆర్ఎస్ ఎలా సిద్ధమవుతున్నది?
ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల తర్వాత చేయాల్సింది తనను తాను పునర్వ్యవస్థీకరించుకోవడం, లోపాలను సరిదిద్దుకోవడం. ప్రస్తుతం మేము అదే చేస్తున్నం. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతూనే, ప్రభుత్వ వైఫల్యాలు, హామీల ఉల్లంఘనలపై నిలదీస్తూనే ఉంటం. మరోవైపు మా సొంత పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయబోతున్నం. ఈ జూన్ నుంచే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్నది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 36,000 పైచిలుకు పోలింగ్ బూత్ స్థాయిల నుంచి మొదలుకొని రాష్ట్ర కమిటీ వరకు అన్ని స్థాయిల్లో పార్టీని సమూలంగా పునర్వ్యవస్థీకరిస్తం. ఈ ప్రక్రియకు కొన్ని నెలల సమయం పడుతుంది. ఐపీఎల్ మ్యాచ్ ఆడే ముందు ఆటగాళ్లకు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో, ఎన్నికలకు వెళ్లే ముందు పార్టీ శ్రేణులకు అంత ఫిట్నెస్ అవసరం. అందుకే మా క్రియాశీల కార్యకర్తలు, నాయకులకు సోషల్ మీడియా వినియోగం, క్షేత్రస్థాయి వ్యూహాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తం. ప్రతి బీఆర్ఎస్ సోల్జర్నూ పూర్తి సమాచారంతో సన్నద్ధం చేసి, ప్రజల్లోకి వెళ్లి మళ్లీ వారి మద్దతు కూడగడుతం.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఫ్యూచర్ సిటీని మీ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తుందా? జర్నలిస్టులకు అకడ ఇండ్ల స్థలాలు ఇస్తామనడంపై మీ అభ్యంతరం ఏంటి?
మొదట ఆ ఫ్యూచర్ సిటీ అనే భ్రమల్లోంచి బయటకు రండి. అకడ ఏమీ లేదు. గాడిదగుడ్డు కూడా లేదు. హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం మేము ల్యాండ్ అక్విజిషన్ చట్టం కింద దాదాపు 14,000 ఎకరాల భూమి సేకరించినం. అది కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్ (నిబంధనలతో కూడిన భూసేకరణ). అంటే ఆ భూమిని కేవలం ఫార్మా యూనిట్లు, ఫార్మా పార్ ఏర్పాటుకు మాత్రమే వినియోగించాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫార్మాసిటీ లేదు ఏమీ లేదు.. అకడ జూ పార్ పెడుతాం, వంతారా తీసుకొస్తాం, ప్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం అంటున్నది. రేపు ఇలాంటి మిస్-అడ్వెంచర్ (నిబంధనల ఉల్లంఘన) చేస్తే చట్టపరంగా అది ఆగిపోతుంది. హరీశ్‌రావు అన్నదాంట్లో వందశాతం నిజం ఉన్నది. ఓవైపు హైకోర్టులో ఫార్మాసిటీ అకడే ఉన్నదని అఫిడవిట్ ఇస్తూ, బయటేమో డ్రామాలు ఆడుతున్నారు. అయినా, జర్నలిస్టులందరూ వెళ్లి ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల పకన ఇండ్లు కట్టుకొని ఉంటారా? మీకు అది సమ్మతమేనా? ప్రస్తుతం రేవంత్‌రెడ్డి చెప్తున్న ఫ్యూచర్ సిటీలో మీకు స్థలాలు ఇస్తామనడం, పకనే జూ పార్ పెడుతామనడం కేవలం ఒక భ్రమ. ఆయనకు అసలు ఫ్యూచరే లేదు. రాహుల్‌గాంధీకి కోపం వస్తే రేపు సాయంత్రానికల్లా ఆయన ఉద్యోగం ఊడిపోతుంది. త్వరలోనే మా ప్రభుత్వం వస్తుంది. మీ సమస్యలన్నీ తీరుస్తం.
మంచిరేవుల్లోనో, బుద్వేల్లోనో 100 ఎకరాలు ఇవ్వొచ్చుకదా!
ముఖ్యమంత్రికి నిజంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే నగరానికి దగ్గరగా ఉన్న మంచిరేవుల్లోనో, బుద్వేల్లోనో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కదా! అకడ ఒక 100 ఎకరాలు ఇవ్వుమనండి. మేము ఎందుకు వద్దు అంటాం? ప్రభుత్వ స్థలాలను ఎంతసేపూ అమ్ముకోవడమేనా? జర్నలిస్టులకు ఇవ్వలేరా? గతంలో మా ప్రభుత్వ హయాంలో జిల్లాల్లో చాలా మంది జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చినం. హైదరాబాద్‌లో ల్యాండ్ కాస్ట్లీ కావడం, కోర్టుల్లో న్యాయపోరాటం జరుగడం వల్ల ఆలస్యమైంది.
జర్నలిస్టులకు 100 కోట్లు కేటాయించిన ఏకైక సీఎం కేసీఆర్
గతంలో పేట్ బషీరాబాద్ ల్యాండ్ వివాదంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రత్యేకంగా నాటి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో మాట్లాడి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు. బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించిన ఏకైక సీఎం కేసీఆర్. కరోనా సమయంలో జర్నలిస్టులకు రూ.20,000 చొప్పున ఆర్థిక సాయం అందించినం. జర్నలిస్ట్ చనిపోతే మీడియా అకాడమీ ద్వారా పెన్షన్ ఇచ్చే విధానం తెచ్చినం. కాబట్టి జర్నలిస్టుల సంక్షేమం గురించి మేము రేవంత్‌రెడ్డి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా ఇవ్వాలనుకుంటే నగరంలో ఉన్న ప్రైమ్ ల్యాండ్స్ ఇవ్వండి. అంతేగానీ ఫార్మాసిటీ ల్యాండ్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, జూ పారులు పెడుతామంటే కుదరదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఫ్యూచర్ సిటీ భూములు చాలా దూరంలో ఉన్నాయి. మంచిరేవుల, బుద్వేల్ లాంటి ప్రైమ్ ల్యాండ్స్ ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వం వస్తే అకడ స్థలాలు ఇస్తామని మాట ఇవ్వగలరా?
మా ప్రభుత్వం వస్తుందనే విషయంలో మీకు ఎలాంటి అనుమానం అకర్లేదు. మాకు ప్రజల ఆశీస్సులున్నయి. రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరిట కేవలం డ్రామాలు ఆడుతున్నడు తప్ప మీకు పట్టాలు ఇవ్వడు. ఒకవేళ ఫార్మా యూనిట్లు, జూ పార్ పకన ఇస్తానన్నా మీరు వెళ్లకండి. ఇవాళ 2026 జూన్ 3 నాడు నేను మీకు ప్రెస్‌క్లబ్ సాక్షిగా మాట ఇస్తున్నా. మా ప్రభుత్వం రాగానే.. ప్రభుత్వం, ప్రెస్‌క్లబ్, మీడియా అకాడమీతో కలిపి జాయింట్ కమిటీ ఏర్పాటు చేస్తం. ఆ కమిటీ ద్వారా జర్నలిస్టులైన మీరే స్థలాన్ని ఎంపిక చేయండి. మీరు ఏ స్థలాన్ని ఎంపిక చేస్తే, అకడే మీకు ఇండ్ల స్థలాలు ఇచ్చే పూర్తి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం పేరిట ఉద్యమంలో కదంతొక్కిండ్రు. కలిసినడిచిండ్రు. యాజమాన్యాల ఎజెండా ఎలా ఉన్నా.. మా ఎజెండా తెలంగాణేనని పోరాడిన కలం వీరులు.
తమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర సీఎంకు రెండు సార్లు లేఖలు రాశానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టు మళ్లీ సాధ్యమేనా?
సీఎం రేవంత్‌రెడ్డి ఆడే ‘డైవర్షన్ గేమ్స్’లో తమ్మిడిహెట్టి ప్రాజెక్టు కూడా ఒకటి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటిపోయింది. అంటే 50 శాతం టైం, ఇంటర్వెల్ అయిపోయింది. నిజంగా చేసేది ఉంటే ఎప్పుడో చేయాలి కదా? ఇప్పుడు ఎందుకు చేయలేదు? అయినా ఈ ప్రాజెక్టు హిస్టరీ సీఎం ఆఫీస్‌లోనే ఉన్నది, ఆయనకు తెలియదా? గతంలో 2013లో కేంద్రంలో యూపీఏ (కాంగ్రెస్), ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్), మహారాష్ట్రలో పృథ్వీరాజ్‌సింగ్ చౌహాన్ (కాంగ్రెస్) ముఖ్యమంత్రులుగా ఉన్నరు. మూడు చోట్లా కాంగ్రెస్ ఉన్నప్పుడే 152 మీటర్ల ఎత్తుతో తమ్మిడిహట్టి కట్టడానికి ఏ పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని, అకడ పెట్టే ప్రతి రూపాయి నిష్ఫలమని మహారాష్ట్ర కాంగ్రెస్ సీఎం లేఖ రాసిండ్రు. మేము అధికారంలోకి వచ్చాక కూడా కేసీఆర్, హరీశ్‌రావు స్వయంగా వెళ్లి అప్పటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను బతిమిలాడిండ్రు. కానీ ఆయన ‘ఈ ప్రాజెక్టు వల్ల నా ప్రాంతమే ముంపునకు గురవుతుంది. దీనికి వ్యతిరేకంగా పోరాడి నేను పైకి వచ్చిన.152 మీటర్లకు ఒప్పుకొనే ప్రసక్తే లేదు’ అని తెగేసి చెప్పిండ్రు. ఇదంతా రేవంత్‌రెడ్డికి తెలుసు. పక రాష్ట్ర సీఎం కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ఉత్తరాలు రాస్తూ డ్రామాలు చేయడం కాదు. రేవంత్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముంబై వెళ్లి, మహారాష్ట్ర సీఎం ఇంటి ముందు ధర్నా చేయాలి. నిరాహార దీక్ష చేయాలి. ఉత్తరాల పేరుతో భ్రమలు కల్పించొద్దు. ఆయన చేసే ప్రతి పనిలో డ్రామా, డైవర్షన్, డిస్ట్రక్షన్ (ధ్వంసం) తప్ప మరేమీ లేదు.
తెలంగాణ కచ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరే! ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అకర్లేదు. వందశాతం ఈ నేల కోసం కష్టపడ్డవాళ్లు, పోరాటాలు చేసినవాళ్లు, త్యాగాలు చేసినవాళ్లు.. ఇకడున్న నాలుగు కోట్ల మంది తెలంగాణ భూమి పుత్రుల జాగీరే ఈ నేల!-కేటీఆర్
తెలంగాణ ‘ఓజీ’ కేసీఆరే!