రంగారెడ్డి, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో పెద్ద ఎత్తున పురుగులు దర్శనమిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్‌పల్లి, మలిశెట్టిగూడ గ్రామాల్లో మంగళవారం పంపిణీ చేసిన సన్నబియ్యంలో పురుగులు రావడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇబ్రహీంపట్నం గోడౌన్ నుంచి మూడు నెలలకు సరిపడా సన్నబియ్యాన్ని రాందాస్‌పల్లి, మలిశెట్టిగూడ గ్రామాలకు రేషన్ డీలర్లు బియ్యం తీసుకువచ్చారు.
బియ్యం వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు రేషన్ దుకాణాలకు వెళ్లారు. అక్కడ పంపిణీ చేసిన బియ్యంలో పురుగులు దర్శనమివ్వడంతో తీసుకునేందుకు మహిళలు నిరాకరించారు. విషయం తెలియడంతో సివిల్ సప్లయ్ అధికారులు వెంటనే ఆ బియ్యాన్ని తిరిగి గోడౌన్‌కు తరలించారు. మంచి బియ్యం తీసుకొచ్చి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. నీకు దండం పెడ్తాం సార్.. మంచి బియ్యం పంపించండని రాందాస్‌పల్లికి చెందిన హైమొద్ది అనే మహిళ సీఎం రేవంత్‌ను వేడుకున్నది. ఈ బియ్యం తిని వాంతులు, విరేచనాలు అవుతున్నాయని వాపోయింది. మీ ఇండ్లలోనూ ఇలాగే తింటున్నారా? అని ప్రశ్నించింది.