సంగారెడ్డి, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అభివృద్ధి జాతర కొనసాగుతున్నదని, సంక్షేమ పథకాల అమలులో దేశానికే మార్గదర్శిగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశానికి సరిపడా ధాన్యం నిల్వలను, వైద్యులను తెలంగాణ అందజేస్తున్నదని స్పష్టంచేశారు. శుక్రవారం ఒకేరోజు 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం కేసీఆర్, శనివారం ప్రపంచంలోనే అతి ఎత్తయిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినట్టు చెప్పా రు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఉత్తర తె లంగాణ సస్యశ్యామలం కాగా, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కానున్నదని సంతోషం వ్యక్తంచేశారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. పటాన్చెరు, సంగారెడ్డి, పుల్కల్లో పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. సంగారెడ్డిలో బాలికల జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. సింగూరు ప్రాజెక్టులో, కంది మండలంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధిని, సీఎం కేసీఆర్ పదేండ్లలో సాధించి చూపారని స్పష్టంచేశారు. దేశంలో తెలంగాణ జనాభా 3% ఉంటే, 33% అవార్డులు వచ్చాయని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో కరువు లేకుండా చేశారని కొనియాడారు.
కాంగ్రెస్‌వి తన్నులు.. బీజేపీవి తిట్లు
కాంగ్రెస్‌ది తన్నుల సంస్కృతి, బీజేపీది తిట్ల సంస్కృతి అయితే, బీఆర్ఎస్ది టన్నుల కొద్దీ వడ్లు పండించే సంస్కృతి అని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఎరువులు, కరెంటు కోసం, కాల్వల వద్ద సాగునీటి కోసం తన్నుకోవాల్సి వచ్చేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు సరిపడా కరెంటు, ఎరువులు, సాగునీరు అందుతున్నట్టు వివరించారు. దీంతో టన్నుల కొద్దీ ధాన్యం పండుతున్నట్టు చెప్పారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కాంగ్రెస్ పట్టించుకోలేదని, కనీసం తాగడానికి నీళు, వ్యవసాయానికి నాలుగు గంటల కరెంటు కూడా ఇవ్వడం ఆ పార్టీకి చేతకాలేదని ఆగ్రహించారు. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు ఓట్ల కోసం గోరుముద్దలు తినిపిస్తామని, అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అందమైన అబద్ధాలు ఆడుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు ఇస్తుందే తప్ప ప్రజలకు ఏమి కావాలో తెలుసుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రజలు తెలివైన వాళ్లని, కాంగ్రెస్ పాలిత కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ర్టాల్లో ఏమి జరుగుతున్నదో తెలుసుకుంటున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా పట్టం కడతారని పేర్కొన్నారు.
పత్తాలేని ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సీఎం కేసీఆర్ పాలనలో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సీఎం కేసీఆర్ సంగారెడ్డిలో 500 కోట్లతో మెడికల్ కాలేజీ, 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సంగారెడ్డికి కొత్తగా 25 కోట్లతో పారా మెడికల్ కాలేజీని మంజూరు చేసినట్టు ప్రకటించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పత్తాలేరని, ఎక్కడున్నారో తెలియదని దుయ్యబట్టారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండరని, కనీసం ఫోన్ నంబర్ కూడా ప్రజలకు తెలియదని మండిపడ్డారు. హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ప్రజల్లో ఉంటూ సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఓట్ల కోసం కాంగ్రెస్ సెక్యులర్ ముసుగు
సెక్యులర్ ముసుగులో కాంగ్రెస్ మైనార్టీల ఓట్లు కొల్లగొట్టే కుయుక్తులు పన్నుతున్నదని, దీనిని మైనార్టీలు తిప్పికొట్టాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పక్కా హిందువు అయినప్పటికీ రాష్ట్రంలోని ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు ఇతర మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు గుర్తుచేశారు. కర్ణాటకలో 90 లక్షల మంది ముస్లింలు, ఇతర మైనార్టీలు ఉంటే, అక్కడి ప్రభుత్వం రూ.2,100 కోట్లు బడ్జెట్ కేటాయించిందని, మహారాష్ట్రలో 1.40 కోట్ల మైనార్టీలకు కేవలం రూ.670 కోట్లు, బెంగాల్లో 2.50 కోట్ల మైనార్టీలకు రూ.2,100 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో 7 కోట్ల మంది మైనార్టీలకు రూ.2,100 కోట్ల బడ్జెట్‌ను అక్కడి ప్రభుత్వాలు కేటాయించాయని గుర్తుచేశారు. తెలంగాణలో 50 లక్షల ముస్లిం మైనార్టీలు ఉంటే సీఎం కేసీఆర్ రూ.2,200 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు వెల్లడించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో మైనార్టీల సంక్షేమానికి కృషి జరుగుతున్నది. తొమ్మిదేళ్లలో ఎక్కడా గొడవలు కానీ, ఒక్క కర్వ్యూకానీ లేవు. దేశంలో మాత్రం ఏదో ఒక మూల మత ఘర్షణలు, గొడవలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయ మాటలను ముస్లిం మైనార్టీలు నమ్మవద్దు. కేసీఆర్‌కు అండగా నిలిచి మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలి.
– మంత్రి హరీశ్‌రావు
తిట్లలో బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. బీజేపీ నేత అమిత్‌షా తిట్టగానే కాంగ్రెస్ నేత ఖర్గే అంతకట్టే ఎక్కువ తిడతారు. బీజేపీ, కాంగ్రెస్ తిట్లలో పోటీ పడితే.. బీఆర్ఎస్ పార్టీ ‘కిట్’లలో పోటీపడుతున్నది. సీఎం కేసీఆర్ హయాంలో కేసీఆర్ కిట్లు, న్యూట్రిషిన్ కిట్లు, కంటివెలుగు కిట్లు అందజేస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ తిట్లు ప్రజల కడుపు నింపవు. కేసీఆర్ ఇచ్చే కిట్లు మాత్రం ప్రజలకు అండగా ఉండాయి.
– మంత్రి హరీశ్‌రావు
ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నది. తెలంగాణలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఏటా 10 వేల మంది వైద్యులు తెలంగాణ నుంచి తయారు కానున్నారు.
– మంత్రి హరీశ్‌రావు
సీడబ్ల్యూసీ మీటింగ్ పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నది. కాంగ్రెస్ ఓటర్లను మోసం చేసేందుకు రకరకాల డిక్లరేషన్లు చేస్తున్నది. కర్ణాటకలో అలవి కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఇప్పుడు హామీలు అమలు చేయడానికి తంటాలు పడుతున్నది. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నాయకులు వస్తారు. ఆ తర్వాత పత్తా ఉండరు. కాంగ్రెస్ పార్టీది సీజనల్ ప్రేమ అయితే.. సీఎం కేసీఆర్‌ది శాశ్వత ప్రేమ. కాంగ్రెస్ పార్టీది లిప్ సింపతి అయితే.. కేసీఆర్‌ది లైఫ్ లాంగ్ సోపతి. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్‌దే.
– మంత్రి హరీశ్‌రావు