ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 17:20:55

గ్రామ పంచాయతీల ‘ఆడిట్’​లో తెలంగాణ ‘మార్గదర్శి’

గ్రామ పంచాయతీల ‘ఆడిట్’​లో తెలంగాణ ‘మార్గదర్శి’

హైదరాబాద్ : తెలంగాణలో అమలు చేసిన ఆన్‌లైన్‌​ ఆడిట్ విధానంపై కేంద్రం ప్ర‌శంస‌లు కురిపించింది. తెలంగాణ అమ‌లు చేసిన ఆడిట్ విధానాన్ని దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది వంద శాతం గ్రామపంచాయతీల‌లో ఆన్‌లైన్‌ ఆడిట్ నిర్వహించనున్నట్లు కేంద్ర పంచాయ‌తీ రాజ్ శాఖ జాయింట్ సెక్రటరి కేఎస్ సేథి వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ లో 25 శాతం గ్రామపంచాయతీల‌లో ఆన్‌లైన్‌ ఆడిట్ పూర్తి చేశారని ప్రశంసించారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ‌ పంచాయ‌తీ రాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ సందీప్​ కుమార్​ సుల్తానియా, తెలంగాణ లోకల్​ ఫండ్​ ఆడిట్​ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావుకు సెంట్రల్​  జాయింట్ సెక్రటరి కేఎస్ సేథి లేఖ రాశారు. 

ఆన్‌లైన్‌లో ఆడిట్ చేయడం వల్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుందన్నారు. గ్రామపంచాయ‌తీల పనితీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకునేందుకు ఆన్‌లైన్ ఆడిట్ దోహదపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడిట్ శాఖ డైరెక్టర్​ ప్రత్యేక‌ చొరవతో పంచాయ‌తీ రాజ్, ఆర్ధిక శాఖ ఉన్నత అధికారులను స‌మ‌న్వ‌యం చేయడంతో మంచి ఫ‌లితాలు వచ్చినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఆన్‌లైన్ ఆడిట్‌లో తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌

అన్ని రాష్ట్రాలు ఈ మాదిరిగా స‌మ‌న్వ‌యం చేసుకోవాలని, తెలంగాణ రాష్ట్రంలో మరో 25 శాతం గ్రామ‌పంచాయ‌తీల‌ను ఆన్‌లైన్ ఆడిట్ చేయాల‌ని కేంద్ర జాయింట్ సెక్ర‌ట‌రీ కోరారు. అన్ని ర‌కాలుగా ఆన్‌లైన్ ఆడిట్‌లో దేశంలోనే తెలంగాణ మొద‌టి స్థానంలో ఉంద‌ని కేంద్ర పంచాయ‌తీరాజ్ శాఖ కార్య‌ద‌ర్శ ప్ర‌శంసించారు. దేశంలోనే తెలంగాణ ఆడిట్ చేసి, ఆడిట్ నివేదికలు ఆన్‌లైన్‌లో పొందుపరిచి, గ్రామపంచాయ‌తీల‌కు నివేదికలు పంపిన తీరు ప్రశంసనీయం అన్నారు. ఇతర రాష్ట్రాలు ఇంకా ఆడిట్ ప్రారంభ‌ దశలోనే ఉన్నాయని, కానీ తెలంగాణలో మొత్తం 12,769 గ్రామపంచాయతీలకు గాను 25 శాతం  గ్రామపంచాయతీల(3,225)లు ఆడిట్ ఆన్‌లైన్‌కి ఎంపిక చేసి ఆడిట్ పూర్తి చేశారన్నారు.  

తెలంగాణాలో ఆన్‌లైన్ ఆడిట్‌లో ఎదురైన సవాళ్ళను, వాటిని అధిగమించిన తీరుని ఇతర రాష్ట్రాలు మార్గదర్శంగా తీసుకోవాలని సూచించినట్లు వివరించారు. వచ్చే ఏడాది 100 శాతం గ్రామపంచాయతీల‌కు ఆన్‌లైన్‌​ ఆడిట్ చేసేందుకు వీలుగా పంచాయ‌తీ అధికారులకు గ్రామ పంచాయ‌తీల‌ వారిగా యూసర్ ఐడీలు క్రియేట్ చేసేలా రాష్టాల పంచాయ‌తీ రాజ్ ఉన్నత అధికారులకు లేఖలు రాయనున్నట్లు తెలిపారు.