మోర్తాడ్ (నిజామాబాద్) : రాష్ట్రంలో యూరియా కొరత (Urea shortage) తీవ్రంగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) విమర్శించారు. తెలంగాణలో రైతు రాజ్యం కాదు.. కాంగ్రెస్ పార్టీ దగా రాజ్యం
కొనసాగుతుందని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ ( KCR ) పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అప్పులు చేయగా రేవంత్ రెడ్డి చేస్తున్న అప్పును ఢిల్లీకి మూటలు కట్టి పంపుతున్నాడని ఆరోపించారు. యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డ ఒక్క బస్తా కూడా దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కోసం బీఆర్ఎస్ పక్షాల అసెంబ్లీలో పోరాటం చేసినా, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కావాలని మొత్తుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయిన లేదని మండిపడ్డారు.
బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం గిరిజన ప్రాంతాల్లో , మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో యూరియా కోసం రాత్రంబవళ్ళు తిండి నిద్రా హారాలు మాని రైతులు పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాత రోజులు వస్థాయని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్కు ఓటు వేసి తప్పు చేసామని బాధపడుతున్నారని మాజీ మంత్రి పేర్కొన్నారు.
బుడ్డర్ ఖాన్ మాటలు..
వరి పొట్ట దశకు వస్తున్నది. రెండు మూడు రోజుల్లో యూరియా అందకపోతే దిగుబడి రాదు. రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది . మక్కలు పూర్తి కావాచ్చింది. పసుపునకు పొటాష్, యూరియా కలిపి వేయాలి.వరికి యూరియా సక్కగా ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క యూరియా బస్తా ఇయ్య చేత కాదు. లక్షల కోట్లతో ఫ్యూచర్ సిటీ కడుతామని అంటున్న రేవంత్ రెడ్డివి అన్ని బుడ్డర్ ఖాన్ మాటలు, లఫంగి మాటలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరియా కోసం ఢిల్లీలో ధర్నా చేద్దాం.. బీఆర్ఎస్ పార్టీ పక్షాన తామంతా వస్తామని అసెంబ్లీలో చెపితే మోదీని నిలదీసే ధైర్యం లేక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పుతో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, రోడ్లు, బ్రిడ్జిలు, భవనాలు, హాస్పిటల్స్ ఇలా అనేక పనులు చేపట్టామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో 2 లక్షల 20 వేల కోట్లు అప్పు చేసి తట్టేడు మట్టి తీసావా ఎక్కడైనా ? ఒక్క ప్రాజెక్ట్ కట్టావా ?ఒక్క గుంత అయినా పూడ్చావా? అంటూ నిలదీశారు. వృథా మాటాలు ఆపి రైతులకు సరిపడా యూరియా అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.