హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల్లో తెలంగాణకు తీవ్ర నిరాశ ఎదురైంది. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అవార్డుల్లో సింహభాగం తెలంగాణకే దక్కాయి. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రెండంటే రెండు అవార్డులకే పరిమతమైంది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని కొన్ని పురపాలక సంస్థలు (అర్బన్ లోకల్ బాడీస్-యూఎల్బీ) కేంద్రీయ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను వివిధ విభాగాల్లో సాధించేవి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 సంవత్సరం తొమ్మిదో ఎడిషన్లో గ్రేటర్ హైదరాబాద్ మంత్రిత్వ అవార్డు (రాష్ట్ర స్థాయి) సాధించగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ మంత్రిత్వ అవార్డు (ప్రత్యేక విభాగం) పొందింది. రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలేవీ కూడా (యూఎల్బీ) అవార్డుకు ఎంపిక కాలేదు. స్వచ్ఛ సర్వేక్షణ్ చివరి అంతిమ దశ- 9వ ఎడిషన్ కోసం ఫీల్డ్ అసెస్మెంట్ ఫిబ్రవరి 15న ప్రారంభమై, మార్చి చివరి నాటికి ముగిసింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఈ నెల 17న న్యూఢిల్లీలో జరగనున్నది.
గతమెంతో ఘనం
2023 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో జోనల్ విభాగంలో సిద్దిపేట, గుండ్లపోచంపల్లి, నిజాంపేట్ అవార్డులను సాధించాయి. ఇంకా 18 మున్సిపాలిటీలు జోనల్ స్థాయి విభాగంలో అవార్డులు పొందాయి. అన్ని పురపాలికల్లో ఎనిమిది గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగంలో 1 స్టార్ స్థితిని, ఒక యూఎల్బీ 5 స్టార్ స్థితిని సాధించాయి. కానీ, ఈ ఏడాది మాత్రం గ్రేటర్ హైదరాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తప్ప మరే ఇతర పురపాలికలు అవార్డులను సాధించలేకపోయాయి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ప్రత్యేక విభాగం మంత్రిత్వ అవార్డును, రాజమండ్రి రాష్ట్రస్థాయి మంత్రిత్వ అవార్డును సాధించాయి. విజయవాడ, గుంటూరు, తిరుపతి స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో గుర్తింపు పొందాయి.
100 రోజుల ప్రణాళికలో ఆర్థిక సమస్యలు
రాష్ట్రంలోని చాలా పురపాలక సంస్థలు 100 రోజుల ప్రణాళికా కార్యక్రమాలను అమలు చేయడంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ కార్యక్రమం జూన్ 2న ప్రారంభమై సెప్టెంబర్ 10 వరకు కొనసాగనున్నది. బీఆర్ఎస్ హయాంలో పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ప్రతి నెలా రూ.116 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్కు రూ.61 కోట్లు, మిగతా 141 పురపాలక సంస్థలకు రూ.55 కోట్లు కేటాయించారు. ఈ నిధులు శానిటేషన్, పర్యావరణం, ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ బలహీనమైన పనితీరు పురపాలక సంస్థల పనితీరును ప్రతిబింబిస్తున్నది.