హైదరాబాద్ : తెలంగాణలో పాఠశాల విద్యార్థులు చిన్నారి చేతులతో రాసిన కథలు నూతన చరిత్రకు శ్రీకారం చుట్టినట్టు అయ్యిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఒకే రోజు ఒకే సమయానికి ఐదు లక్షల మంది విద్యార్థులు ‘మన ఊరు మన చెట్టు’ అన్న అంశంపై కథలు రాయడం దేశ చరిత్రలోనే మొట్ట మొదటిది కావడం తెలంగాణ గర్వించదగ్గ విషయమని ఆమె పేర్కొన్నారు. 33 జిల్లాలకు చెందిన విద్యార్థులు రాసిన కథలను ముప్పై మూడు పుస్తకాలుగా తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించి, విద్యార్థి లోకానికి అందించడం అభినందించదగ్గ విషయమన్నారు.
సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ విద్యార్థులు కలం పట్టి తమ ఊరి ప్రకృతిని అద్భుతంగా కథలుగా మలచి దేశానికే మోడల్‌గా నిలిచారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాలలో దేశానికే మోడల్‌గా నిలిచినట్లు తెలంగాణ పాఠశాల విద్యార్థులు కూడా దేశానికి మోడల్‌గా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి మంగళవారం తన కార్యాలయంలో ‘మన ఊరు మన చెట్టు’ అనే అంశంపై తెలంగాణ సాహిత్య అకాడమీ వెలువరించిన ముప్పై మూడు పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులలో నూతన సృజనలను రగిలించేందుకై తెలంగాణ సాహిత్య అకాడమీ చేసిన కృషిని అభినందించారు. విద్యార్థులలో దాగి ఉన్న కొత్త ఆలోచనలకు పురుడుపోసేందుకు, వారిలో ఉన్న సాహిత్య పటిమను వెలుగు చూపేందుకు ఈ కథా రచన ప్రయోగం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. బాల సాహిత్య విస్తృతికి కృషి చేయడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలో పుస్తక ప్రదర్శనలతో జ్ఞాన తెలంగాణ కోసం కృషి చేస్తున్న సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌ను ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి శాలువాతో సన్మానించారు.
ఈ ముప్పై మూడు కథల పుస్తకాలను రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు అందిస్తామని మంత్రి చెప్పారు. జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ..సాహిత్య అకాడమీ చేసిన ఆలోచనకు కార్యరూపాన్నిచ్చి బాల సాహిత్య కథా యజ్ఞంలో రాష్ట్రంలోని పాఠశాలలన్నీ పాల్గొనే విధంగా కృషి చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బాల సాహిత్య కథా రచయితలు, పాఠశాల విద్యా శాఖా అధికార బృందం కృషి మరువలేనిది అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి నామోజు, తెలంగాణ విద్యా మౌలిక వసతుల సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, ప్రొ. నారా కిశోర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పిఆర్టియు రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు డి. శ్రీపాల్ రెడ్డి, బి. కమలాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.