హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ ప్రజలకు జై తెలంగాణ అంటే ఒక ఎనర్జీ, కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాత్రం ఎలర్జీ’ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అప్పుడైనా ఇప్పుడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర పట్ల రేవంత్‌కు నిలువెల్లా ద్వేషం ఉన్నదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఎన్నడూ అమరవీరులకు నివాళులర్పించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘కేసీఆర్ వల్ల తెలంగాణ రావడంతో చంద్రబాబు విజయవాడకు పోయిండు..రేవంత్‌రెడ్డి చంచల్‌గూడ జైలుకు పోయిండు. అందుకే రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అనడం లేదు’ అని దుయ్యబట్టారు. ‘అమరావతిలో ఉన్న బాబు శాసిస్తాడు.. ఇకడ ఉన్న బానిస రేవంత్‌రెడ్డి పాటిస్తాడు’ అని దెప్పిపొడిచారు.
ప్రసుతం గోదావరి-బనకచర్లపై అదే జరుగుతున్నదని మండిపడ్డారు. చంద్రబాబుకు తెలంగాణ ఇప్పుడు సామంత రాజ్యంగా మారిందని, రేవంత్‌రెడ్డి సామంతుడిగా మారిండని నిప్పులు చెరిగారు. తెలంగాణ తేవడమే కాదు, తెలంగాణకు బద్ధవ్యతిరేకి టీడీపీని తెలంగాణలో కూకటి వేళ్లతో పెకిలించి కేసీఆర్ ఎవరూ చేయని పనిచేశారని కొనియాడా రు. అందుకే చంద్రబాబు రేవంత్ రూ పంలో తెలంగాణపై కక్ష తీర్చుకుంటున్నారని విమర్శించారు.
రేవంత్‌కు పీసీసీ పదవి చంద్రబాబు చలవేనని, చంద్రబాబు డబ్బులు, పచ్చ మీడియా సహకారంతో అడ్డగోలు హామీలతో రేవంత్ అధికారంలోకి వచ్చాడని దుయ్యబట్టారు. ఇరిగేషన్ రంగంపై ఉన్న కమాండ్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు అద్భుతమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని కొనియాడారు.
‘తెలంగాణ అనేది ఒక్క సెంటిమెంటే కాదు.. అది అస్తిత్వం, ఉనికి, వాస్తవం’ అని దేశపతి స్పష్టంచేశారు. తెలంగాణ, హైదరాబాద్ గొప్పదనం గురించి చాటి చెప్పారు. తన పాటలతో విద్యార్థులను అలరించారు. ‘జై తెలంగాణ’ అనే నినాదం మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్రకటిత నిషేధం కొనసాగుతున్నదని చెప్పారు. ‘ఎందుకు రేవంత్‌రెడ్డికి ఇంకా బానిసత్వం?’ అని నిలదీశారు.