నిజామాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, ముందుచూపు కారణంగా రాష్ట్రంలో సంతులిత అభివృద్ధి, సంపద సృష్టి జరుగుతున్నదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. సృష్టించిన సంపద సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరుతున్నదని, దీంతో వారి కొనుగోలు శక్తి కూడా పెరుగుతున్నదని వివరించారు. సంపద సృష్టి స్థిరాస్తిరంగం అభివృద్ధికి వెన్నెముక లాంటిదని చెప్పారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల సంయుక్త ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రాపర్టీషోను శనివారం ఆయన.. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వైస్ ప్రెసిడెంట్ డీ చిరంజీవి, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్ సురేందర్రావుతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సీఎం కేసీఆర్ పేదలకు నేరుగా ఇప్పటివరకు రూ.మూడు లక్షల కోట్లు పంపిణీ చేశారని వివరించారు. ఇది సమాజంలో డబ్బు చలామణికి దోహదం చేసిందని, తద్వారా ప్రాపర్టీ రంగంలోనూ కొనుగోళ్లు పెరిగాయని చెప్పారు. నిరంతర విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల పంటల దిగుబడులు సైతం భారీగా పెరిగాయని గుర్తు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేయడంతో స్థిరాస్తి వ్యాపార అభివృద్ధిలో వేగం పెరిగిందని అన్నారు. సీఎం కేసీఆర్ దీక్ష, పట్టుదల కారణంగా తెలంగాణ నేడు దేశంలో నంబర్‌వన్ రాష్ట్రంగా విరాజిల్లుతున్నదని కొనియాడారు. దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు తెలంగాణ మాడల్ కావాలని కోరుతున్నారని చెప్పారు.
20 లక్షల ఉద్యోగాల సృష్టి
ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ కృషితో రూ.3 లక్షల కోట్లతో కొత్త పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా 20 లక్షల ఉద్యోగాలు లభించాయని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి ఐటీరంగ ఎగుమతులు రూ.58 వేల కోట్ల నుంచి రూ.2.70 లక్షల కోట్లకు పెరిగాయని తెలిపారు. సంపద సృష్టి, ప్రజల్లోకి పంపిణీ ఫలితంగా తెలంగాణ వృద్ధిరేటు 16 శాతానికి ఎగబాకిందని వివరించారు. జాతీయ వృద్ధిరేటు 9 శాతం వద్దనే ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెండున్నర రెట్లు పెరగడం ప్రజల జీవన ప్రమాణాలు, స్థిరాస్తిరంగం వృద్ధి చెందాయనడానికి నిదర్శనమని తెలిపారు. హైదరాబాద్ లాంటి మహా నగరాలకే పరిమితమైన ప్రాపర్టీషోలను నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో సైతం నిర్వహిస్తుండటం అభినందనీయమని అన్నారు. ఇలాంటి షోలు ప్రజలకు ఉపయోగపడుతాయని చెప్పారు. అన్ని రకాల అనుమతులు గల వ్యాపారులు, బ్యాంకర్లు, డీలర్లను ఒకే గొడుగు కిందకు తెచ్చి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.
నమస్తే తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా ప్రజలకు స్థిరాస్తి రంగంలో ఒకే వేదికపై అవసరమైన అన్ని సేవలను అందించే లక్ష్యంతో ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని రకాల అనుమతులు ఉన్న వారితో షో నిర్వహిస్తున్నామని చెప్పారు. నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో భూమికి, ఇతర ప్రాపర్టీలకు పటిష్ట భద్రతా వ్యవస్థ ఏర్పడిందని వివరించారు. తెలంగాణలో ఒకప్పుడు భూమి భారం.. కానీ నేడు అభరణం అని పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అనేక పట్టణాలు, నగరాల్లో ఎనలేని వృద్ధి కనిపిస్తున్నదని నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్ సురేందర్‌రావు పేర్కొన్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు అద్భుతమైన స్పందన వస్తున్నదని చెప్పారు. ప్రాపర్టీషోలో భాగంగా నిజామాబాద్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన పలు నిర్మాణ రంగ సంస్థలు స్టాళ్లను ఏర్పాటుచేశాయి.
ఔత్సాహికులకు గృహ రుణాలు అందజేసేందుకు ఎస్బీఐ, యూబీఐ, కెనరా బ్యాంకులు సైతం ప్రదర్శనలో పాల్గొన్నాయి. తొలి రోజు ప్రాపర్టీ షోకు నిజామాబాద్ జిల్లా నలుమూలల నుంచి భారీగా సందర్శకులు తరలి వచ్చారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌రావు, ఎస్బీఐ డీజీఎం ప్రఫుల్లాకుమార్ జెనా, యూబీఐ డీజీఎం నరేంద్రకుమార్, కెనరా బ్యాంక్ ఏజీఎం శ్రీనివాస్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, ఎడిషన్ ఇన్చార్జి లక్మ రమేశ్, బ్యూరో చీఫ్ జూపల్లి రమేశ్, ఏడీవీటీ మేనేజర్ శ్రీకాంత్, ఏసీఎం సునీల్ తదితరులు పాల్గొన్నారు.