హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): దళిత సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మాడల్ అని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం చరిత్రాత్మకమని చెప్పారు. 75 ఏండ్లలో దళితుల కోసం కాంగ్రెస్, బీజేపీ చేసింది శూన్యమన్నారు. గురువారం అసెంబ్లీలో ఎస్సీ బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. దేశంలో దళితుల సంక్షేమం కోసం ఏనాడూ.. కాంగ్రెస్, బీజేపీ ఆలోచించలేదని అన్నారు. కేసీఆర్ మంచి మనసుతో ‘దళితబంధు’ తెస్తే అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే తొలిసారిగా దళితుల ఉపాధి కల్పనకు రూ.10 లక్షలు ఇస్తున్నదని తెలిపారు.
ఈ నిధులతో ఎన్నో దళిత కుటుంబాలు ఆర్థిక అభ్యున్నతి సాధిస్తున్నాయని సోదాహరణంగా వివరించారు. కల్యాణలక్ష్మి కింద 2,00,288 మంది దళిత ఆడపడుచులకు రూ.1,986 కోట్టు ఇచ్చామని తెలిపారు. ఈ బడ్జెట్లో ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్సీఎస్డీఫ్) కింద రూ.36,750 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిపా రు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్‌ను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచామని వెల్లడించారు. ఇప్పటివరకు రూ.168 కోట్లతో 953 మందిని విదేశాలకు పంపామని తెలిపారు. ప్రపంచంలోనే ఎత్తయిన (125 అడుగులు) అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో నిర్మిస్తున్నారని చెప్పారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతున్నారన్నారు.
మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. 2013-14 వరకు పదేండ్లలో మైనార్టీల సంక్షేమానికి రూ.2,219 కోట్లు వెచ్చిస్తే.. స్వరాష్ట్రంలో ఇప్పటివరకు రూ.8,784 కోట్లు ఖర్చుచేశామని స్పష్టంచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1,825 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.