Telangana | రాష్ట్రం ఏడుస్తున్నది. ఐదే ఐదు నెలల్లో ఎంత గోస వచ్చిందని రోదిస్తున్నది. నాడు కడుపు నిండిన నీటివనరులు.. నేడు నీళ్లేవని నిట్టూరుస్తున్నయ్. మిషన్ కాకతీయ పుణ్యాన మత్తళ్లు దుంకిన చెరువుల్లో నేడు నీటి జాడలేక దుర్భిక్ష ఛాయలు కమ్ముకున్నయ్. ఎర్రటి ఎండలోనూ జలాభిషేకం చేసుకున్న కుంటలు, వాగులు నేడు పిచ్చిమొక్కల పాలైనయ్. మడులకు తడులు లేక నేలలన్నీ నెర్రెలిచ్చినయ్. భూమికి బరువయ్యే పంటలు పండిన నేలన.. నేడు పచ్చని పైరులన్నీ ఎండిపోయినయ్. ఉమ్మడి పాలనలో కనిపించిన కరువు జాడలు మళ్లీ నీడలా వెంటాడేందుకు వస్తున్నయ్. కాళేశ్వరాన్ని కాట కలపాలని చూస్తున్న పాలకుల కుట్రలో తెలంగాణ తల్లి గుండె చెరువైతున్నది.
నాడు నిండు కుండ.. నేడు ఇసుక మేటలు!
నేడు
మేళ్లసముద్రం చెరువు ఇప్పుడు పూర్తిగా ఎండిపోయి నెర్రెలు వారింది. 10 ఏండ్ల తర్వాత ఈ చెరువు ఎండిపోయిందని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
నాడు
నల్లగొండ మండలం గుండ్లపల్లి డీ37 కాలువ ద్వారా వాయిలేరు చెరువుకు చేరి కనగల్ మండలంలోని మైలసముద్రం చెరువుకు నీళ్లు వస్తాయి. 1,300 ఎకరాల విస్తీర్ణం. 91 గ్రామాలకు తాగునీరు, 1,600 ఎకరాలకు సాగునీరు అందేది. చుట్టూ 10 కిలోమీటర్ల మేర భూగర్భజలాలు పెరిగేవి. వేలాది మంది మత్య్స కారులకు ఉపాధి ఉండేది.
నాడు
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బొందుగుల ఊరచెరువు గత ఏడాది వరకు మండుటెండలోనూ నిండుకుండలా కనిపించింది. తపాసుపల్లి ప్రాజెక్టు ద్వారా నీటిని నింపటంతో భూగర్భ జలాలు కూడా బాగా పెరిగేవి.
నేడు
ఈ ఏడు తపాసుపల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లు నింపకపోవటంతో బొందుగుల చెరువు నీళ్లు లేక ఎండిపోయింది.
నాడు ఎండాకాలంలోనూ అలుగు పోసేది బొందుగుల చెరువును బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా తపాసుపల్లి ప్రాజెక్ట్ ద్వారా నింపేది. దీంతో ఈ చెరువు ఎండకాలం కూడా అలుగు పోసేది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెరువు నింపాలనే సోయిలేక నీళ్లు లేక ఆయకట్టు ఎండిపోయింది. -మర్ల నాగరాజు, బొందుగుల రైతు, రాజాపేట మండలం
కనుచూపుమేర నీళ్లు కనిపించేదంతా మైదానమే!
నాడు
నల్లగొండ మండలంలోని ముశంపల్లి పెద్దచెరువును మిషన్ కాకతీయ రెండో విడుత రూ.2కోట్లతో కేసీఆర్ సర్కారు పునరుద్ధరించింది. 2015 నుంచి 2023 వరకు ఈ చెరువు నిండుకుండలా ఉంది. 2500 ఎకరాల ఆయకట్టు సాగయ్యేది
నేడు
నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల లేకపోవడంతో ముశంపల్లి చెరువు పూర్తిగా ఎండిపోయింది. భూగర్భజలాలు పడిపోవటంతో సగానికిపైగా పంటలు ఎండి పోయాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు చెరువులోనే బోర్లు వేసినా ఫలితం లేకపోయింది
నాడు
సిద్దిపేట జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా ఉమ్మడి మద్దూరు మండలంలోని కమలాయపల్లి చెరువుకు పేరు. ఈ ప్రాంత రైతులకు ఓ కల్పతరువులాంటిది. వెలగలరాయుని చెరువుగా పిలిచే ఈ చెరువు ద్వారా 1,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందేది. తపాస్పల్లి, రంగనాయకసాగర్ రిజర్వాయర్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి జలాలతో నింపటంతో గత ఏడాది వరకు నిండుకుండలా ఉన్నది
నేడు
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కమలాయపల్లి చెరువును గోదావరి జలాలతో నింపకపోవటంతో పదేండ్లుగా నిండుకుండలా ఉన్న కమలాయపల్లి చెరువు ప్రస్తుతం ఎండిపోయి వెక్కిరిస్తున్నది
పదేండ్లు చెరువే ఎండిపోలె
సుట్టుముట్టు ఊర్లల్ల మా చెరువే పెద్దది. ఈ చెరువుల నీళ్లు ఉంటే మాకు కరువు ఉండది. వానకాలంలో చెరువు నిండి మత్తడి పోసినంక ఎండకాలంలో నీళ్లు తగ్గంగనే మల్ల గోదావరి నీళ్లతోటి నింపేది. ఎండకాలంలో కూడా మత్తడి పోసేది. ఈ ఏడాది మాత్రం నీళ్లు లేక చెరువు ఎండిపోయింది. మునుపటి లెక్క గోదావరి నీళ్లతోటి నింపుతలేరు. ఇప్పటికే బోరుబావులు ఎత్తిపోతున్నయ్. ఇట్లనే ఉంటే ఎవుసం చేసుకోవడానికి తక్లీబైతది. – శనిగరం వెంకటయ్య, రైతు, కమలాయపల్లి
లోతెంతో తెల్వని తటాకం.. లోట్టపీసు చెట్లకు నిల్వలు
నాడు
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా బోథ్ నియోజకవర్గంలోని బజార్హత్నూర్ చెరువును రూ.18 కోట్లతో బాగుచేయడంతో కుడి కాలువ ద్వారా 20 గ్రామాలు, ఎడమ కాలువ ద్వారా 5 గ్రామాల రైతులకు సాగునీరు అందింది
నేడు
ప్రస్తుతం ఈ చెరువు పరిస్థితి అధ్వానంగా మారింది. పాలకులు పట్టించుకోకపోవడంతో నీటిచుక్క లేకుండాపోయింది. ఈ ఏడాది నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నాడు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం పెద్ద చెరువును మిషన్ కాకతీయ పథకంలో పునరుద్ధరించటంతో చెరువు జలకళ సంతరించుకొన్నది. గతంలో 250 ఎకరాల ఆయకట్టు ఉండగా, మిషన్ కాకతీయ ఫలితంగా 400 ఎకరాలకు పెరిగింది. చెరువు మరమ్మతుతో ఆకారం పక్కనే ఉన్న రఘోత్తంపల్లి రైతులకూ సాగునీటి సమస్య తీరింది
నేడు
గతంలో మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగు ద్వారా చెరువులోకి నీరు వదిలేవారు. ఈ సారి వాగు ద్వారా నీరు విడుదల చేయకపోవటంతో ఆకారం పెద్ద చెరువులో నీరు అడుగంటిపోయింది. దీంతో రైతులు సాగునీటి కోసం కష్టాలు పడ్డారు
నాడు
కాళేశ్వం జలాల రాకతో 2023 మే నెలలో జలకళతో ఉట్టిపడుతున్న మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెం ఊర చెరువు
నేడు
గత ఎనిమిదేండ్లలో ఎన్నడూ ఎండని పడమటిగూడెం ఊర చెరువు ఇప్పుడు నెర్రెలు బారి వెక్కిరిస్తున్నది
కాలువ పిచ్చిమొక్కల పాలైంది
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చెరువుల పునరుద్ధరణ పనులు జరగటంతో యాసంగి పంటలకు పుష్కలంగా నీరు అందేది.
ఈ ఏడాది ఎండకాలంలో చెరువు ఎండిపోవటంతో యాసంగి పంటలకు అంతంత మాత్రంగా నీరు అందింది. నేను కాలువ పక్కనే ఉన్న 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. అందులో మక్కజొన్న వేశా. పిచ్చిమొక్కలు,
మట్టితో కాలువ కరాబ్ అయ్యింది.
– విజేందర్, రైతు, బజార్హత్నూర్, ఆదిలాబాద్ జిల్లా
కాంగ్రెస్వాళ్లే పంటలు ఎండేలా చేశారు
కేసీఆర్ సర్కారులో మా ఆకారం చెరువులో నీరు పుష్కలంగా ఉండేది. ఈ ఏడు నీరు అడుగంటిపోయింది. సమైక పాలన మాదిరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటికష్టాలు ఎదురవుతున్నాయి. మల్లన్నసాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి నీరు విడుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం , ఆ పార్టీ నాయకులు రాజకీయం చేస్తూ సకాలంలో వాగులోకి నీటిని విడుదల చేయలేదు. దీంతో ఈ యాసంగిలో ఆకారం, రఘోత్తంపల్లి గ్రామాలలో సాగునీరు లేక పంటలు ఎండిపోయాయి.
– పోలబోయిన నారాగౌడ్, రఘోత్తంపల్లి మాజీ సర్పంచ్, సిద్దిపేట జిల్లా