Telangana | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): కీలక స్థానాల్లో ఉన్న ఒక్కో ఇంజినీరుకు రెండు, అంతకు మించి బాధ్యతలు.. కిందిస్థాయి ఇంజినీర్లు, సిబ్బందికి శక్తికి మించి పర్యవేక్షణ విధులు. ఉన్న అధికారులు, సిబ్బంది విరమణ పొందుతుంటే వారి స్థానాల్లో మరొకరికి అదనపు బాధ్యతలు.. ఇది ఒకటి, రెండు నెలలుగా కాదు.. ఏకంగా ఏడాదికి పైగా ఇదే తంతు. మొత్తంగా కాంగ్రెస్ సర్కారు తాత్సారంతో ఒక్క ఏడాదిలోనే సాగునీటి పారుదలశాఖ అస్తవ్యస్తమైంది. ఒకరి వెంట ఒకరు సీనియర్ ఇంజినీర్లు విరమణ పొందుతుండగా, ఆ స్థానాలను భర్తీ చేయకుండా ఇతర సీఈలకు, లేదంటే ఎస్ఈలకు అదనపు బాధ్యతలను సర్కారు అప్పగిస్తూ వస్తున్నది. వివిధ విభాగాల్లో పూర్తిస్థాయి అధికారులను నియమించకుండా ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తున్నది. వెరసి ఈ శాఖ పరిపాలన పూర్తిగా గాడితప్పింది. ప్రాజెక్టుల పనుల సంగతేమో కానీ, తుదకు సాగునీటి సరఫరాను సైతం ఈ ఏడాది పర్యవేక్షించలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్న దుస్థితి నెలకొన్నది. చేతికొచ్చిన పంటలను కాపాడే నాథుడే లేక అన్నదాతలు ఎక్కడికక్కడ గగ్గోలు పెడుతున్నారు.
ఇరిగేషన్ శాఖలో ఇప్పటికే జనరల్, ఓఅండ్‌ఎంలో 2 ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 22 సీఈ పోస్టులు ఉండగా, 13 మంది సీఈలు ఉద్యోగ విరమణ పొందారు. ఈ నెలలో మరో ఇద్దరు సీఈలు విరమణ పొందనున్నారు. 59 మందికి పైగా ఎస్ఈలు, అనేక సర్కిళ్లలో ఈఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రమోషన్లను కల్పించి ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ సర్కారు ఏడాదిగా మీనమేషాలను లెక్కిస్తున్నది. ఈఎన్సీ, సీఈ స్థాయి నుంచి దిగువన ఏఈఈ వరకు 2,796 శాంక్షన్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 2,436 మంది ఉన్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్, సూపరింటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో 2,538 శాంక్షన్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 1,953 మంది ఉన్నారు. రెండింటిలో కలిపి మొత్తంగా 5,334 శాంక్షన్ పోస్టులు ఉండగా ప్రస్తుతం 4,389 మందే ఉన్నారు. అందులో ఇంజినీరింగ్ విభాగంలో 360, ఇతర విభాగాల్లో 586 పోస్టులు మొత్తంగా 945 ఖాళీలు ఉన్నాయి. గడచిన ఏడాది కాలంలో మరో 231కి పైగా ఖాళీలు ఏర్పడ్డాయి.
ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్లు కల్పించాలని 7 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ప్రమోషన్ల సినియారిటీ జాబితాను సిద్ధంచేసి ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటివరకూ ప్రభుత్వం మాత్రం ఎటూతేల్చలేదు. ఆ తర్వాత దీనిపై ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. గత జనవరి నెలాఖరు కల్లా ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ మొత్తాన్ని పూర్తిచేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇది జరిగి రెండు నెలలు గడచినా అతీగతి లేకుండాపోయింది. ఇటీవలే డీపీసీ (డిపార్ట్మెంట్ ప్రమోషనల్ కమిటీ) సైతం ఈఎన్సీ పోస్టుకు సంబంధించి 9 మందికి ఆమోదం తెలిపింది. శ్రీనివాస్, కేఎస్ఎస్ చంద్రశేఖర్, పీవీపీ ప్రసాద్, చక్రధర్, అమ్జద్ హుస్సేన్, బీ శంకర్, శంకర్‌నాయక్, మోహన్‌కుమార్, సుధాకర్‌రెడ్డి పేర్లను కమిటీ ప్రతిపాదించింది. ఆ ఫైలు ప్రభుత్వానికి చేరినా, ముందుకు కదలడం లేదు. ఆ జాబితాలో ఉన్నవారిలో ఇప్పటికే ఇద్దరు విమరణ పొందగా, ఈ నెలాఖరున మరో ఇద్దరు కూడా విరమణ పొందనున్నారు. అన్ని స్థాయిల్లో ఉన్న ఒక్కో ఇంజినీర్లు రెండు, అంతకు మించి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఫలితంగా సాగునీటి పారుదలశాఖ పాలన గాడి తప్పుతున్నదని సీనియర్ ఇంజినీర్లు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రమోషన్లు కల్పించి, పూర్తిస్థాయి అధికారులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విరమణ పొందిన ఉద్యోగులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించవద్దని హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
2