Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ) : రాష్ట్రానికి కనీవినీ ఎరుగని రీతిలో పెట్టుబడులు తెచ్చినట్టు ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ అందులో కార్యరూపం దాల్చినవి మాత్రం ఒక్కటీ కనపడడంలేదు. రెండుసార్లు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులు, సింగపూర్, అమెరికా, తాజాగా జపాన్ పర్యటన సందర్భంగా ఒప్పందాలు జరిగినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అవన్నీ కాగితాలకే పరిమితమైనట్టుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల కోసం చేస్తున్న పర్యటనలకు కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతున్నా, వాటితో ఫలితాలు మాత్రం రావడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తేవడంతోపాటు పన్నుల రూపంలో ఆదాయం పెంచుకునే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడుల కోసం కృషి చేయడం సహజం. అనేక రకాల ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించి పరిశ్రమలను ఆకర్షిస్తుంటాయి. చేసుకున్న ఒప్పందం కాగితాలు దాటి కార్యరూపం దాల్చినప్పుడే ప్రభుత్వ కృషి సార్ధకమైనట్టు భావించవచ్చు.
అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో ఎటువంటి పురోగతి కానరావడంలేదనేది పరిశ్రమ వర్గాల విమర్శ. ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడి లెక్కలు, ఏర్పాటవుతున్న పరిశ్రమలను పరిశీలిస్తే ఈ విమర్శ నూటికి నూరుపాళ్లు వాస్తవమని చెప్పక తప్పదు. ఎందుకంటే.. రెండు దఫాలు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు సందర్భంగా జరిగిన ఒప్పందాలు ఇంతవరకు ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. ఏదైనా పరిశ్రమ ఏర్పాటు కావాలంటే కొంత సమయం పడుతుందనడంలో సందేహం లేదు. అయితే, ఒప్పందం జరిగాక సదరు కంపెనీ తమ పరిశ్రమకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించడం, ప్రభుత్వం దాన్ని పరిశీలించి ఆమోదం తెలపడం, అందుకు అనుగుణంగా వారికి కావాల్సిన భూముల కేటాయింపు, రాయితీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం వంటి ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అయితే, ఇవేవీ జరుగుతున్న దాఖలాలు లేవు. రెండుసార్లు దావోస్ పర్యటనలు, సింగపూర్, అమెరికా పర్యటనలు, తాజాగా జపాన్ పర్యటన అన్నీ కలుపుకొని రూ. 2లక్షల కోట్లకుపైగా పెట్టుబడి ఒప్పందాలు జరిగినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిసారీ పర్యటనకు సీఎం, మంత్రిసహా పెద్ద సంఖ్యలో అధికార యంత్రాంగం విదేశాలకు వెళ్తున్నది. ప్రతి పర్యటనకూ రూ. 10-20కోట్ల వరకూ ప్రజాధనం ఖర్చవుతున్నది.
సహజంగా పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు, రాయితీల కోసం టీఎస్ ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకుంటారు. అన్నీ సవ్యంగా ఉంటే అనుమతుల మంజూరీతోపాటు భూ కేటాయింపు జరుగుతుంది. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలకు సంబంధించి… ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం టీజీఐఐసీ అధికారులు సదరు కంపెనీని సంప్రదించి వారినుంచి పరిశ్రమకు సంబంధించిన ప్రతిపాదనలు తీసుకుంటారు. అయితే, ఒప్పందాల తరువాత ఈ ప్రక్రియేదీ జరగడంలేదు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలు టీజీఐఐసీకి రావడంలేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, ఇలా ఒప్పందాలు చేసుకున్నవారు సొంతంగా కూడా టీఎస్ ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంలేదని వారు పేర్కొంటున్నారు. ‘ఒప్పందాలు చేసుకున్న కంపెనీలను మేము ఫాలోఅప్ చేస్తున్నాం. వారు వస్తాం.. వస్తాం, డీపీఆర్లు ఇస్తాం అని చెబుతున్నారు కానీ రావడంలేదు. మేము వారిని బలవంతం చేయలేం కదా’. అని ఓ అధికారి పేర్కొన్నారు.
మరోవైపు, ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలు చాలావరకు వివాదాస్పదం అవుతున్నాయి. ఉర్సా క్లస్టర్స్ కంపెనీకి కనీసం చిరునామా కూడా లేదనే ఆరోపణలు వెల్లువెత్తగా, మారుబేనీ ఇండియా కంపెనీపై పలు దేశాల్లో కేసులు నమోదైనట్టు తేలింది. అంతేకాదు, ఒప్పందాలు చేసుకున్న చాలావరకు కంపెనీలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ర్టానికి వచ్చినవే కావడం విశేషం. అవి తదుపరి విస్తరణ కోసం ప్రస్తుత ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ అవేవీ ఇంకా కార్యరూపం దాల్చడంలేదు.
దావోస్ పర్యటన(2024) రూ.40,232కోట్లు
దావోస్ పర్యటన(2025) రూ.1,78,950కోట్లు
సింగపూర్ పర్యటన(2025) రూ.3,950కోట్లు
జపాన్ పర్యటన(2025) రూ.12,062కోట్లు