హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్‌రెడ్డి తన నిఘా వర్గాలను ప్రయోగించారా? ఆయన రోజువారీ కదలికల మీద గూఢచర్యం చేయిస్తున్నారా? అందుకోసమే తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలను బీహార్‌కు పంపించారా? ఆయన భౌతికంగా ఇక్కడే ఉన్నా మనసంతా పొంగులేటి చుట్టూనే తిరుగుతున్నదా? ఇక్కడ తను నిద్రపోకుండా, అక్కడ నిఘా వర్గాలను నిద్రపోనియ్యకుండా ఇబ్బంది పెడుతున్నారా?.. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ వర్గాలు అవుననే అంటున్నాయి. బీహార్‌లో ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఇంటెలిజెన్స్ పోలీసు బృందాలను అ క్కడికి పంపించినట్టు తెలిసింది. అక్కడి ఎన్నికల ట్రెండ్‌ను పసిగట్టి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ను అప్రమత్తం చేసేందుకు నిఘా వర్గాలు బీహార్ వెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే, వాస్తవం వేరేలా ఉన్నదని అంటున్నారు. బీహార్‌లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమన్వయకర్తగా వెళ్లినట్టు తెలిసింది. అక్కడ ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో సన్నిహితంగా మెలుగుతున్నారు.
బీహార్ ప్రజల డీఎన్ఏలోనే కూలితనం ఉందని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీహార్లోనే కాదు, సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఆయనను స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి తప్పించింది. ఆయన స్థానంలో పొంగులేటిని పంపాలని కోరింది. వాయవ్య బీహార్‌లోని తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, భోజ్‌పూర్ తదితర జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయ బాధ్యతను అప్పగించింది. ఈ నేపథ్యంలో పొంగులేటి జాతీయ కాంగ్రెస్ నేతలతోపాటు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జునఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.
అంతేకాదు, వారితో కలిసి అక్కడి బహిరంగ సభల్లోనూ పాల్గొంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు రేవంత్‌రెడ్డిని భయపెడుతున్నదని పొంగులేటి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. సీఎంకు, పొంగులేటికి మధ్య వ్యక్తిగత విభేదాలేవీ లేనప్పటికీ, ఎప్పటికైనా పొంగులేటి తనకు పొటెన్షియల్ థ్రెట్ అని సీఎం వర్గం భా విస్తున్నది. ఆయనకు చెక్ పెట్టేందుకు రాష్ట్రం లో అనేక ప్రయోగాలు చేసింది. ఆయన అవినీతి చిట్టాను, భూకబ్జాల వాటాలను గుప్పిట పట్టుకొని కట్టడి చేస్తూ వచ్చింది. మీడియాకు లీకులిచ్చింది. కానీ బీహార్ ఎన్నికల నేపథ్యం లో అధిష్ఠానానికి ఆయన ఎక్కడ దగ్గరైతారోనని సీఎం ఆందోళనతో ఉన్నట్టు సమాచారం.
పొంగులేటి బలమైన ఆర్థిక శక్తిగా భవిష్యత్తులో తమకు ముప్పుగా మారబోతున్నారని ముఖ్యనేత వర్గం మొదటి నుంచే కీడు శంకించినట్టు కాంగ్రెస్ వర్గాలు బహిరంగంగానే చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన సదరు నేత ఎన్నికల సమయంలో పార్టీకి సహాయం పరంగా వెన్నెముకగా నిలబడ్డారనే ప్రచారం ఉన్నది. దాదాపు 35 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు ఆయన సాయం చేశారని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. తన పలుకుబడితో దక్షిణ తెలంగాణ జిల్లాలోని అభ్యర్థుల ఎంపికలో ఆయన కీలకంగా వ్యవహరించారని, ఆయన సిఫార్సు మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందని పార్టీలో ప్రచారం ఉన్నది. ఆ సాయానికి మెచ్చే కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నట్టు తెలిసింది. అలాగే, ఆయన డైరెక్టర్‌గా ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీకి రూ. 7 వేల కోట్ల కాంట్రాక్ట్ బకాయిలను చెల్లించినట్టుగా అప్పట్లో చర్చ జరిగింది.
తాజాగా తను బీహార్‌లోనూ ఇటువంటి పాత్రే పోషిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తన పనితనంలో అధిష్ఠానాన్ని మెప్పించేలా పని చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో పరిపాలన గాడి తప్పిందని, ఇప్పుడున్న సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారని ఏఐసీసీ భావిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి తరహాలోనే పొంగులేటి ఏమైనా చక్రం తిప్పుతారేమోనని రేవంత్‌రెడ్డి వర్గం ఆందోళనతో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
పలు అనుమానాల నడుమ మంత్రి పొంగులేటి రోజువారీ కార్యకపాలపై నిఘా పెట్టి, ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి రాష్ట్ర ఇంటెలిజెన్ వర్గాలను వా యువ్య బీహార్‌కు పంపినట్టు తెలిసింది. 10కి పైగా నిఘా బృందాలు ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. ఆయనను కలుస్తున్న దెవరు? దూతలెవరు వస్తున్నారు? ఎవరి తో ఏం మాట్లాడుకున్నారు? ఏఐసీసీలోని టాప్ 5 నేతల్లో ఎవరితో ఎక్కువ టచ్‌లోకి వెళ్తున్నారు. ఎన్నిసార్లు కలిశారు? ఎంత సే పు మాట్లాడారు? అన్న అంశాలపై రాష్ట్ర నిఘా వర్గాలు సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. బీహర్‌లో పొంగులేటి వేస్తున్న ప్రతి అడుగు, తీస్తున్న ప్రతి మూటపై తెలంగాణ దృష్టి పెట్టారని. ఆయన వ్యక్తిగత సె క్యూరిటినీ తమ గుప్పిట్లోకి తీసుకున్నట్టు తెలిసింది. అక్కడి సమాచార నివేదికలను ఎప్పటికప్పుడు హైదరాబాద్‌కు పంపుతున్నట్టు తెలిసింది. షాడో హోంమంత్రిగా పోలీస్ వ్యవహారాలు చూస్తున్న సీఎం సన్నిహిత వ్యక్తి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. వచ్చే సమాచారాన్ని సీఎంకు చేరవేస్తున్నట్టు తెలిసింది.