Indiramma Indlu | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో 82లక్షల దరఖాస్తులు స్వీకరించింది. తొలివిడతగా 4.5లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ ఇప్పుడు ఇండ్లు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. కేంద్రం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని పీఎంఏవైతో అనుసంధానం చేయడంతో లబ్ధిదారుల ఎంపిక అత్యంత జఠిలంగా మారింది. దరఖాస్తు చేసుకోవడానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు ద్వారా దరఖాస్తుదారుల వివరాలను కేంద్రం సేకరిస్తుంది. ఎవరైనా తప్పుడు వివరాలు ఇచ్చినా కేంద్రం రూపొందించిన ప్రత్యేక యాప్ గుర్తిస్తుంది.
ఇల్లు లేని నిరుపేదలు, ఒకవేళ ఇల్లు ఉంటే అది రెండు గదులలోపు కచ్చా ఇల్లు అయితే ఇందిరమ్మ ఇంటి దరఖాస్తులు అర్హులు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా రోజువారీ కూలీ అయి ఉండాలి. కుటుంబ సభ్యులు, సంపాదించే వ్యక్తులు, స్థిర, చరాస్తుల వివరాలు, రేషన్ కార్డు, ఆదాయం, సొంత ఇల్లు ఉందా? ఉంటే అది పక్కా ఇల్లా కాదా? సొంత జాగా ఉందా? ఉంటే ఎంత ఉంది? కరెంటు కనెక్షన్, ఇంట్లో ఫ్రిజ్, టీవీ, వాహనం? గ్యాస్ కనెక్షన్ ఉందా? గతంలో ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధిపొందారా? వాటి వివరాలు వంటి సమాచారం యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తులు, ఇంటింటి సర్వే వివరాల ఆధారంగా గృహనిర్మాణ శాఖ అధికారులు యాప్‌లో నియోజకవర్గాలవారీగా దరఖాస్తు చేస్తారు. వికలాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది దేశవ్యాప్తంగా 2కోట్ల ఇండ్లు మంజూరు చేయనున్నట్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన 4.5లక్షల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తుందా లేదో వేచిచూడాల్సిందే. ఇళ్ల మంజూరులో కేంద్రం రాష్ర్టాన్ని యూనిట్‌గా తీసుకుంటుంది. నియోజకవర్గాలవారీగా యాప్‌లో వివరాలు నమోదు చేయడం వల్ల అన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం దక్కే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ కేంద్రం ఒక్కో ఇంటికి ఇచ్చేది రూ.1.20 లక్షలు మాత్రమే. మిగిలిన రూ.3.80 లక్షలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. కానీ ఆ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్లకు రోజుకొక మెలికలు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.