హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ఒక రంగమంటూ లేదు. ఏ రంగాన్ని తీసుకొన్నా అన్నింట్లోనూ తెలంగాణది అగ్రస్థానమే. తెలంగాణకు సాటి వచ్చేది కానీ.. మేటిగా నిలిచేది కానీ లేదు.. రాదు. వ్యవసాయం, రైతు సంక్షేమంలో ఏ రాష్ట్రమూ మనతో పోటీకి నిలువలేదు. ముఖ్యంగా అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించడంలో కానీ, సాగునీరు, విద్యుత్తు, విత్తనాలు, ఎరువులు అందించడంలో కానీ తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా మారిందనడంలో సందేహం లేదు. దేశంలో ఏ రాష్ర్టానికి వెళ్లినా.. ఏ వ్యవసాయ నిపుణుడిని కదిలించినా.. చివరకు అంతర్జాతీయస్థాయిలో ఐక్యరాజ్యసమితి ప్రముఖులను అడిగినా.. తెలంగాణ రైతులకు లభిస్తున్న పెట్టుబడి సాయంపై వేనోళ్లా ప్రశంసలే.. ఒక దార్శనికుడైన నాయకుడు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తే.. తన ప్రజల కష్టాలను పారదోలడానికి నిబద్ధతతో శ్రమించే నేత దార్శనికతతో పథకాన్ని రచిస్తే.. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో.. తెలంగాణ వ్యవసాయరంగం ఒక తార్కాణంగా నిలుస్తుంది. ఇవాళ తెలంగాణలో వ్యవసాయం ప్రపంచానికి ఓ పాఠం. వివిధ ప్రభుత్వాల లోపభూయిష్టమైన రైతు విధానాలకు గుణపాఠం. ఏడాదికి రెండు విడతలుగా గత నాలుగేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం అన్నింటికంటే మించిన ఆదర్శం. ఈ పథకాన్ని సాక్షాత్తూ మోదీ సర్కారు కాపీ కొట్టి పీఎం కిసాన్ పథకాన్ని తీసుకురాగలిగిందే కానీ.. అధిగమించలేక పోయిందని తాజా గణాంకాలే విశ్లేషిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం 2018లో రైతుబంధు, 2019లో రైతు బీమా పథకాలను తీసుకొచ్చింది. ఈ రెండు పథకాల ద్వారా ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం రూ.54,016 కోట్లు రైతన్నకు సాయంగా అందించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల రైతులకు అందించిన సాయం రూ.1,09,114 కోట్లు. పైగా కేంద్ర ప్రభుత్వం చేసే సాయం ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి గంపగుత్తగా మూడు విడతల్లో అందించే సాయం రూ.6 వేలు మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం ఎంతమంది రైతులున్నా ఏడాదికి ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు విడతలుగా వానకాలం, యాసంగి సీజన్లకు అందిస్తున్నది. రైతుబంధు పథకం ప్రారంభించినప్పటికంటే.. రైతుల సంఖ్య దాదాపు పది లక్షలు పెరిగిందంటేనే తెలంగాణలో వ్యవసాయం వైపు ప్రజలు ఏ విధంగా మళ్లుతున్నారో.. ఎందుకు ఆసక్తి చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత జరిగిన భూ లావాదేవీల అనంతరం కొత్తగా పట్టాలు పొందిన రైతులు కూడా ఈ నెల 27 నుంచి ప్రారంభమైన రైతుబంధు సాయాన్ని అందుకొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నకు అందించే పెట్టుబడి సాయం కేంద్రం కంటే ఎక్కువ మాత్రమే కాదు. ఏటా కొత్తగా చేరిన రైతులకు కూడా అందిస్తున్నది. కేంద్రం మాత్రం పీఎం కిసాన్ పథకం ప్రారంభించినప్పటి నుంచి రైతుల జాబితాపై కోత పెడుతూనే ఉన్నది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకం ప్రవేశపెట్టినప్పుడు (2019 ఫిబ్రవరిలో) ఈ పథకం కింద 12.5 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున (3 విడతల్లో రూ.2 వేల చొప్పున) అందించడానికి రూ.75 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. మొదట రెండు హెక్టార్ల భూమి కలిగిన రైతులకు పీఎం కిసాన్ పథకాన్ని వర్తింపజేయాలని భావించింది. తర్వాత ఈ నిబంధనను తొలగించింది. దీంతో దీని వ్యయాన్ని రూ.87.218 కోట్లకు సవరించింది. అమలులోకి వచ్చేటప్పటికి 2019-20లో అంచనా వేసిన దాంట్లో 35% కోత పెట్టి రూ.48,714 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వివిధ సాకులు చూపించి రైతుల సంఖ్యను కూడా కుదిస్తూ వచ్చింది.
పీఎం కిసాన్ పథకానికి విడత విడతకు రైతుల సంఖ్యను కుదించడానికి కూడా కారణాలను రాష్ర్టాలపైకి నెట్టింది. ఆధార్ కార్డుతో పట్టాదారు పాస్‌పుస్తకం అనుసంధానం కాలేదని, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద రైతుల లెక్కలు సరిగా లేవని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేని కారణంగా పత్రాలు అప్లోడ్ కావడం లేదంటూ కారణాలు చూపిస్తుంది. రైతన్నను ఆదుకోవడంలో, సాయం అందించడంలో తెలంగాణ రాష్ట్రంతో ఏ కోణంలో కూడా కేంద్రం పోటీ పడలేదని ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. కేంద్రమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల, వారి సంక్షేమం చూపుతున్న శ్రద్ధ ప్రేమ, ఔదార్యం మరే రాష్ట్రం చూపడం లేదన్నది నిష్ఠుర సత్యం. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ నేతలు మాత్రం కండ్లుండి కూడా చూడలేని కబోదుల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు.