Minister Jagadish Reddy | సూర్యాపేట : మైనార్టీల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో పరిపాలించిన పార్టీలు ముస్లింలను కేవలం ఓటుబ్యాంక్‌గానే చూశాయి తప్పా వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. స్వతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా మైనారిటీల బతుకులు మారలేదని, జీవితాల్లో వెలుగులు కానరాలేదన్నారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతికి అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. షాదీముబారక్, మైనారిటీ గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్, ఇమామ్, మౌజమ్‌లకు గౌరవవేతనం ఇవ్వడంతో పాటు హజ్ యాత్రికులకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, మైనార్టీబంధు తదితర అనేక కార్యక్రమాలు మైనారిటీల ప్రగతికి మైలురాయిగా నిలుస్తున్నాయి.
ఎన్నికల్లో ఇచ్చినవేగాక ఇవ్వని హామీలు సైతం అమలు చేస్తూ మైనారిటీ జీవితాల్లో వెలుగు నింపుతున్నదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ముస్లింల అభివృద్ధి సాధ్యమన్న ఆయన.. సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిని గుర్తించాలని కోరారు. మైనార్టీవర్గం నిండు మనసుతో ఆశీర్వదిస్తే సేవకుడిగా పని చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను గడపగడపకు వివరిస్తూ గెలుపులో భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన మైనార్టీ యువకులు అక్రమ్, రియాజుద్దీన్ బీఆర్ఎస్లో చేరగా.. గులాబీ కండువాతో మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.