హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ‘సార్ క్షమించండి. భోజనం లేదు అయిపోయింది. ఓ గంటపాటు వెయిట్ చేస్తే మళ్లీ భోజనం ఏర్పా టు చేస్తాం.. ప్లీజ్ కైండ్ బీ సీటెడ్’ అంటూ గ్లోబల్ సమ్మిట్‌లో చెప్పిన సిబ్బంది మాటలు విని విస్తుపోవడం ప్రతినిధులు, ఇతర ఆహుతుల వంతయింది. డెలిగేట్స్, ప్రభుత్వాధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, మీడియా ప్రతినిధులు, డ్యూటీ ఆఫీసర్లు ఇలా విభాగాల వారీగా ఐడీ కార్డులు చెక్ చేసి మరీ రెండు గుడారాల బయట ఉన్న ప్రైవేట్ సిబ్బంది భోజనాలకు అనుమతించారు. ఓ డెలిగేట్ లాంజ్‌లో లోపల భారీగా క్యూ ఉన్నదని చెప్తూ.. అతిథులను సైతం లోపలికి అనుమతించకపోవడంతో ఆకలిమంటతో రగిలిపోయారు.
మరో లాంజ్‌కు వెళ్తే.. అక్కడ కూడా అవే ప్రశ్నలు ఎదురుకావడంతో తామొచ్చింది? దేనికంటూ ఎదురు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులను ప్రైవేట్ సిబ్బంది పలు రకాలుగా ప్రశ్నిస్తూ అవమానించేలా ప్రవర్తించారు. దీంతో కొందరు మీడియా ప్రతినిధులు భోజనాలు చేయడానికి కూడా నిరాకరించారు. లోపల ఉన్న భారీ క్యూలో జనం ఎంతకూ కదలకపోవడం, లోపల ఉన్నవారికే పూర్తిగా భోజనం పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆకలిమంటతో బయట ఉన్న ప్రతినిధులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. మీడియాను భోజనానికి అనుమతించిన లాంజ్లోకే ప్రభుత్వాధికారులు, డ్యూటీ ఆఫీసర్లను రానివ్వకపోవడంతో వారు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
గ్లోబల్ సమ్మిట్ రెండో రోజైన మంగళవారం కూడా రుచిపచిలేని వంటకాలనే వడ్డించారు. తొలిరోజు నూనె తేలిన బిర్యానీతో ఇబ్బందులు పడిన ప్రతినిధులు.. రెండోరోజు వడ్డించిన నీళ్ల చారులాంటి పప్పు, కూరలతో విస్తుపోయా రు. నాన్‌వెజ్ ప్రియుల కోసం వండిన చికెన్ తిని ఓ జాతీయ మీడియా వెబ్ మీడియా జర్నలిస్టు వాంతులు, విరేచనా లు చేసుకున్నారు. చికెన్, మటన్ కూర లు సరిగా ఉడకలేదని, బిర్యానీ బదులు బగారా తాలింపు దినుసులతో చేసిన అన్నంతో సగం సగం తిని కడుపునింపుకొన్నారు. నాసిరకం వంటలతో ఇబ్బందులు పడిన ఎంతోమంది.. స్వీట్లు, ఐస్క్రీమ్లతోనే సరిపుచ్చుకున్నారు.