Kalyanalakshmi | హైదరాబాద్ : కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని రేవంత్ రెడ్డి సర్కార్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పొన్నం ప్రభాకర్ పంచనివ్వడం లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో అధికారులు చెక్కులు పంపిణీ చేయకుండా ఆపుతున్నారని హైకోర్టులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నెల 27 వరకు చెక్కులు పంపిణీ చేయకుంటే బౌన్స్ అయ్యే ప్రమాదం ఉందని, త్వరగా పంచడానికి అనుమతులు ఇప్పించాలని కౌశిక్ రెడ్డి కోర్టును అభ్యర్థించారు. దీనిపై చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను కోర్టు ప్రశ్నించింది. చెక్కుల పంపిణీలో ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించి, స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఎలాంటి పదవుల్లో లేని కాంగ్రెస్ నాయకులు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. నిన్న కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌లో సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.