హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు పట్టా భూమిలోనే ‘మైహోం విహంగ’ అపార్ట్మెంట్లను నిర్మించినట్టు గతం లో కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. 2008లోనే హైకోర్టు తీర్పు ద్వారా హెచ్‌సీయూ భూమిని ప్రభుత్వమే లింగమయ్యకు బదలాయింపు చేసినట్టు రికార్డులున్నా యి. ఆ భూమిని యజమానులు 2013లో ‘మైహోం’ సంస్థకు విక్రయించడంతో అదే ఏడాది జూలైలో ‘విహంగ’ అపార్ట్మెంట్ల నిర్మాణం ప్రారంభమైనట్టు తెలుస్తున్నది.
వివరాల్లోకి వెళ్తే.. కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 14, 16 నుంచి 23 వరకు ఉన్న 25 ఎకరాల 31 గుంటల భూమికి అసలు పట్టాదారు లింగమయ్య. ఆ భూమి హెచ్‌సీయూకి కేటాయించిన భూముల మధ్య ఉండటంతో దానిని వర్సిటీ ఆక్రమించుకున్న ది. దీనిపై లింగమయ్య కేసు (O.S. No.193/92) వేయడంతో ఆ భూమిని ఖాళీచేసి లింగమయ్యకు అప్పగించాలని హెచ్‌సీయూని ఆదేశిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ, ఆ భూమి చుట్టూ హెచ్‌సీయూ భూము లు ఉండటంతో లింగమయ్య వారసులు తమ భూమిలోకి వెళ్లేందుకు బాట లేకుండా పోయింది. బాట ఇవ్వాలని, లేదా ప్రత్యామ్నాయ భూమిని ఇవ్వాలని ప్రభుత్వానికి లింగమయ్య వినతిపత్రం సమర్పించారు.
వర్సిటీ పాలక మండలి నిర్ణయం మేరకు రిజిస్ట్రార్, వీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కంచ గచ్చిబౌలిలోని 25.31 ఎకరాలకు బదులుగా, గోపన్నపల్లి లోని సర్వే నంబర్ 37లో 21 ఎకరాలను ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. రెండు భూముల విలువ సమానంగా ఉన్నందున పట్టాదారులకు సమానమైన 25.31 ఎకరాల భూమిని కేటాయించాలని అప్పట్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభు త్వం నిర్ణయించింది. 2008 డిసెంబర్ 10న జీవో నంబర్ 1473 ద్వారా రంగారెడ్డి కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. దీంతో గోపన్నపల్లిలోని 25.31 ఎకరాల భూమిని లింగమయ్య వారసులకు అప్పగించారు. ఆ తర్వాత లింగమయ్య వారసుల నుంచి బీ నవీన్‌కుమార్, ఆయన కుటుంబసభ్యులు కొనుగోలు చేశారు. వారు 2013లో మైహోం సంస్థకు ఇచ్చారు. దీంతో అన్ని అనుమతులు పొందిన తర్వాత 2013 జూలైలో ‘మైహోం విహంగ’ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది.