హైదరాబాద్, జూలై 4(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు జరిగాయంటూ దాఖలైన వ్యాజ్యాల్లో ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ప్రాజెక్టు నిర్మాణాల వ్యవహారంపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ విచారణతోపాటు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కొనసాగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, న్యాయవాది రామ్మోహన్‌రెడ్డి, వ్యక్తిగత హోదాలో ప్రొఫెసర్ కోదండరాం, ముదిగంటి విశ్వనాథరెడ్డి, బక్క జడ్సన్ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.
రాష్ట్రం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేయకుండా కేంద్రాన్ని, సీబీఐని మాత్రమే చేయడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ఉత్తర్వులు ఎలా ఇస్తామని పిటిషనర్‌ను ప్రశ్నించింది. న్యాయవాది రామ్మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని రాష్ట్రాన్ని ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతివ్వాలని కోరగా ధర్మాసనం అనుమతిచ్చింది.
బక్క జడ్సన్ వ్యాజ్యాన్ని ఉపసంహరించేందుకు అనుమతివ్వాలని ఆయన న్యాయవాది శరత్‌కుమార్ కోరగా ధర్మాసనం నిరాకరించింది. ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతున్నందున పిల్‌ను వాపస్ తీసుకుంటామని శరత్ కోరారు. ఘోష్ కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు జడ్సన్‌కు అనుమఇచ్చింది. వ్యాజ్యాలపై విచారణను 2 వారాలు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.