హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : శంషాబాద్ మండలంలోని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయాలనే ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టంచేసింది. శంషాబాద్ మండలంలోని 51 పంచాయతీలను శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేస్తూ జారీచేసిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ మాజీ సర్పంచ్ పద్మావతి ఇతరులు వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం తీర్పుచెప్పింది. మున్సిపాల్టీలో కలిపితే పన్నుల భారం పెరుగుతుందన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. చిన్నగోలొండ, పెద్దగోలొండ, బహదూర్‌గూడ, హమీదుల్లానగర్ మొదలైన గ్రామాల విలీనాన్ని అడ్డుకోవాలన్న పిటిషన్లను కొట్టివేసింది. విలీనాన్ని అడ్డుకోరాదన్న ప్రభుత్వవాదనను ఆమోదించింది.
హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ఈ నెల 17న నేషనల్ వాటర్ డవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశం జరగనున్నది. ఈ అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి రాష్ర్టాల డిమాండ్లను తీర్చడం సాధ్యం కాదని ఈ నెల మొదటివారంలో జరిగిన సమావేశంలో కేంద్ర జల్‌శక్తి శాఖ చేతులెత్తేసింది. ప్రాజెక్టుపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేసింది. ఈ నెలలో మరోసారి సమావేశం నిర్వహిస్తామని, ఇదే చివరిదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే 17న సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల అధికారులు హాజరుకావాలని కోరింది.
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్‌పై కృష్ణా ట్రిబ్యునల్‌లో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమైంది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ హాజరయ్యారు. ఏపీ తరఫున సాక్షి అనిల్‌కుమార్ గోయల్‌ను విచారించారు.