హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించారని పేరొంటూ ప్రముఖ కవి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నపై సైఫాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో వెంకన్న దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం విచారణ జరిపారు. ఎన్నికల నిబంధనలను వెంకన్న ఉల్లంఘించలేదని, రాజకీయ కక్షతో కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో ఈ కేసు విచారణను నిలిపివేయాలని కింది కోర్టుకు స్పష్టం చేసిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు నిమిత్తం ప్రతివాదులైన పోలీసులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను 22కు వాయిదా వేసింది.