హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): పేదల ఇండ్లనే కూలుస్తారా, చెరువు గర్భంలో జరిగే ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే తీరిక లేదా.. అని హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది. హైదరాబాద్ నగరంలోని తార్నాక-లాలాగూడ పరిధిలో ఎర్రకుంట చెరువు ఆక్రమణలపై హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీతోపాటు సంబంధిత శాఖల అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎర్రకుంట చెరువు పరిరక్షణకు సంబంధించి దాఖలైన రిట్ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు.
హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీతోపాటు ఇతర శాఖల ప్రతివాదులు చెరువు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు. లాలాగూడ పరిధిలోని తార్నాక ఎర్రకుంట చెరువు (హెచ్ఎండీఏ లేక్ ఐడీ-4500, సర్వే నంబర్ 124)లో సుమారు ఎనిమిది ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో పెద్దఎత్తున అక్రమంగా శాశ్వతంగా నిర్మాణాలు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ న్యాయవాది విజయ్‌గోపాల్ వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలుచేశారు. చెరువును ఆక్రమించిన అన్ని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని, కూల్చివేత ఖర్చులను ఆక్రమణదారుల నుంచే వసూలు చేయాలని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్ఎండీఏ 2015 డిసెంబర్ 17న జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్లో ఎర్రకుంటను రక్షిత జలవనరుగా గుర్తించినప్పటికీ ఇప్పటివరకు తుది నోటిఫికేషన్ జారీచేయకపోవడం వల్ల ఆక్రమణలు పెరిగాయని తెలిపారు.
2023 ఏప్రిల్ 10, 2024 ఆగస్టు 27 తేదీల్లో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా, గత మే 26న ఈ-మెయిల్, లిఖితపూర్వకంగా హైడ్రాకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తులను రక్షించేందుకే హైడ్రా ఏర్పాటైనా ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.. ఎర్రకుంటకు సంబంధించి తుది నోటిఫికేషన్‌ను నిర్దిష్ట గడువులో జారీ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. హైడ్రా, హెచ్ఎండీఏలు చెరువులోని అక్రమ నిర్మాణాలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలు తెప్పించుకొని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు.