హైదరాబాద్, ఫిబ్రవరి11 (నమస్తే తెలంగాణ) : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో కేసు విచారణలో ఉన్న జాగలోని నిర్మాణాన్ని అక్రమంటూ ఎలా కూల్చుతారని, ఏ అధికారంతో ఆ నిర్మాణాన్ని తొలగించారని ప్రశ్నించింది. ఎలాంటి అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారని నిలదీసింది. ప్రభుత్వ ఉత్తర్వులు, మున్సిపల్ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని హైడ్రాను ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలో 10 నుంచి 303, 306 నుంచి 311, 313 నుంచి 315 సర్వే నంబర్లలో 1,608 చదరపు గజాల స్థలాలకు ఉన్న ప్రహరీని కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ 8 మంది దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ బుధవారం ఈ ఆదేశాలు జారీచేశారు. ఆ ప్రహరీ గోడను కూల్చాక ఏర్పాటు చేసిన కంచెను 48 గంటల్లోగా తొలగించాలని హైడ్రాకు స్పష్టం చేసింది. అకడ హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డును మాత్రం యథాతథంగా ఉంచవచ్చని పేర్కొం టూ.. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.