High Court | హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా చేపడుతున్న చర్యలన్నీ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలని హైకోర్టు తేల్చిచెప్పింది. మర్రి, మారుతి ఎడ్యుకేషన్ సొసైటీ విద్యాసంస్థల నిర్మాణాలను కూల్చివేసేందుకు 7 రోజుల గడువుతో తాహసీల్దార్ ఇచ్చిన నోటీసులను రద్దుచేసి, వాటిని షోకాజ్ నోటీసులుగా సవరించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై నోటిఫికేషన్లు జారీచేసి, ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలని, వారు చూపించే ఆధారాలను పరిశీలించాకే ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
మర్రి, మారుతి ఎడ్యుకేషన్ సొసైటీల పిటిషన్లు పరిషారమైనట్టు ప్రకటిస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్ (ప్రస్తుతం మేడ్చల్ మలాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం)లోని 480-483 సర్వే నంబర్లలో మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన 10 ఎకరాలు, మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన 17.20 ఎకరాల్లో ఆక్రమణలున్నాయంటూ ఈ నెల 22న గండిమైసమ్మ ఎమ్మార్వో ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ ఆ రెండు విద్యా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారణ జరిపారు. చిన్నదామెర చెరువులో 8.25 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయంటూ తాసిల్దార్ ఇచ్చిన నోటీసును రద్దు చేయాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి కోరారు.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించకుండా తాసిల్దార్ ఏకపక్షంగా నోటీసు ఇచ్చారని పేర్కొంటూ.. చట్టప్రకారం సర్వే నిర్వహించి సరిహద్దులు నిర్ణయించేలా తాసిల్దార్‌కు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మర్రి విద్యాసంస్థల్లో దాదాపు 5 వేల మంది విద్యార్థులు ఉన్నారని, కూల్చివేత చేపడితే వారంతా ఇబ్బందులకు గురౌతారని చెప్పారు. ఆ విద్యా సంస్థల నిర్మాణాలకు 2007లోనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ ఈవోల నుంచి అనుమతులు పొందారని, ఇప్పుడు వాటిని అక్రమణలని ఏకపక్షంగా చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ.. చిన్నదామెర చెరువులోకి ఆక్రమణదారులు మురుగునీటిని వదులుతున్నారని, అక్కడ ఆక్రమణలు ఉన్నాయని అడ్వకేట్ కమిషన్ నివేదించడంతో ఆ ఆక్రమణలను తొలగించాలని గతంలో ద్విసభ్య ధర్మాసనం ఆదేశించిందని గుర్తుచేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమణలను కూల్చివేయాలని గతంలో సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసిందని హైడ్రా తరఫు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి చెప్పారు.
ఈ వాదనల అనంతరం జస్టిస్ కే లక్ష్మణ్ స్పందిస్తూ.. హైకోర్టుతోపాటు జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా తాసిల్దార్ 7 రోజుల గడువుతో కూల్చివేత నోటీసులు ఇవ్వడం, ఇప్పుడు కూల్చివేతలకు హైడ్రా రంగంలోకి దిగడంతో ఆ విద్యాసంస్థలు ఆందోళన చెందుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తాసిల్దార్ ఇచ్చిన నోటీసులను రద్దు చేసి, వాటిని షోకాజ్ నోటీసులుగా మారుస్తున్నామని తెలిపారు. పిటిషనర్లు చూపిన ఆధారాలను పరిశీలించాక చట్ట ప్రకారం హైడ్రా ముందుకువెళ్లాలని స్పష్టం చేస్తూ.. మర్రి, మారుతీ విద్యాసంస్థల పిటిషన్లపై విచారణ ముగిసినట్టు ప్రకటించారుఅప్పటివరకు కూల్చివేతలు చేపట్టొద్దు
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మలాజిగిరి జిల్లా కొర్రాముల (వెంకటాపూర్)లోని నాదం చెరువుకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయంటూ అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారని పేర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ,
నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరోసారి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ టీ వినోద్‌కుమార్ బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్లు అన్ని అనుమతులు తీసుకుని 17.21 ఎకరాల్లో విద్యాసంస్థలను నిర్మించినట్టు వారి తరఫు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి తెలిపారు. కూల్చివేత చర్యలు చట్టానికి లోబడి ఉండాలని స్పష్టం చేస్తూ ఇటీవల హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులకు విరుద్ధంగా అధికారుల చర్యలు ఉన్నాయని, విద్యార్థులకు ఇబ్బందుల్లేకుడా సెలవుల్లోనే కూల్చివేతలు చేపడతామని చెప్పిన హైడ్రా అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని వివరించారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన జస్టిస్ వినోద్‌కుమార్.. అప్పటివరకు పిటిషనర్ల నిర్మాణాలను కూల్చరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.