చెన్నై, ఫిబ్రవరి 11: అధికారంలో వాటా కావాలంటూ కాంగ్రెస్ చేస్తున్న డిమాండును తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తోసిపుచ్చారు. తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం పనిచేయదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం తమిళనాడులో పనిచేయదని మాకూ తెలుసు, వారికీ(కాంగ్రెస్) తెలుసు అని ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ స్టాలిన్ వ్యాఖ్యానించారు.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో 133 సీట్లను డీఎంకే గెలుచుకోగా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మిత్రపక్షంగా పోటీ చేసిన కాంగ్రెస్ పోటీ చేసిన 25 సీట్లలో 18 స్థానాలను గెలుచుకుంది. అయితే కాంగ్రెస్‌కు డీఎంకే ప్రభుత్వంలో చోటు దక్కలేదు. ఈసారి మాత్రం కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను డిమాండు చేస్తుండడంతో మిత్రుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తున్నది.
ఇండియా టుడే రౌండ్‌టేబుల్‌లో స్టాలిన్ ప్రసంగిస్తూ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేపై విమర్శలు గుప్పించారు. అది డబుల్ ఇంజిన్ కాదని, డబ్బా ఇంజిన్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.ఎన్నికల ముందు ప్రజల్లో అబద్ధాలు, విద్వేషం, ఉద్రిక్తతలను ఎన్డీయే ప్రచారం చేస్తున్నదని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కావాలా లేక ఏక పార్టీ ప్రభుత్వం కావాలా అన్న విషయాన్ని తమిళనాడు ప్రజలే నిర్ణయిస్తారని లోక్‌సభ సభ్యుడు మాణిక్కం ఠాగూర్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తమ కూటమి అధికారంలోకి వస్తే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే సెల్వపెరున్తగై చేసిన డిమాండును ప్రస్తావిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని పేర్కొన్నారు.