హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ లిమిటెడ్‌కు కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు రెగ్యులర్ సీఎండీని నియమించింది. రెండేండ్ల తర్వాత సంస్థ కొత్తబాస్‌గా సీనియర్ ఐఏఎస్ జ్యోతిబుద్ధప్రకాశ్‌కు బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి సంస్థలో సర్కార్ పెద్దల జోక్యం పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో ఒక్కో సంస్థను ముఖ్యమంత్రి బంధువులు పంచుకోగా, సింగరేణి సంస్థను సీఎం బావమరిదికి అప్పగించారనే ఆరోపణలున్నాయి.
సీఎం బావమరిదే రింగ్‌మాస్టర్ అవతారమెత్తి, అనేక నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపణలొచ్చాయి. ఇదిలాఉండగా, ఇటీవలి కాలంలో సింగరేణి టెండర్లు వివాదాస్పదమయ్యాయి. స్కామ్‌లు వెలుగు చూశాయి. మెస్సీ ఫుల్బాల్ మ్యాచ్‌కు రూ.10 కోట్ల సింగరేణి సీఎస్సార్ నిధులను కేటాయించడం విమర్శలకు దారితీసింది. కార్మికుల చెమట, రక్తంతో పోగైన సొమ్ములను సీఎం ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం వాడుకోవడాన్ని కార్మికలోకం తీవ్రంగా వ్యతిరేకించింది.
నైని బొగ్గు గని టెండర్లు, ఓవర్ బర్డెన్ టెండర్ల స్కామ్ సంస్థకు తీవ్ర అప్రతిష్ట తెచ్చిపెట్టింది. సైట్విజిట్ సర్టిఫికెట్ పేరిట తమ అనుకూలురుకే టెండర్లు కట్టబెట్టేందుకు ప్రయత్నించడం, ఈ వ్యవహారంలో సీఎం బావమరిది ప్రమేయం ఉండటంతో ఏకంగా సర్కార్ ఈ టెండర్లను రద్దుచేసే వరకు వెళ్లింది. సోలార్ టెండర్ల స్కామ్, పేలుడు పదార్థాల టెండర్లల్లో అక్రమాలు సైతం వెలుగుచూశాయి. పైగా గత కొంతకాలంగా సింగరేణి ఆర్థిక పరిస్థితి సైతం గాడితప్పుతున్నది. నెలకు రూ.300 కోట్లు ఓవర్‌డ్రాఫ్ట్ (ఓడీ)గా తీసుకొచ్చి జీతాలు చెల్లించే స్థితికి దిగజారింది.
మొత్తంగా ఇలా అనేకానేక వివాదాలకు సింగరేణి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుండటంతో అప్రమత్తమైన సర్కార్.. ఎట్టకేలకు రెగ్యులర్ సీఎండీని నియమించింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఇంతకాలం సంస్థకు సీఎండీలుగా పనిచేసిన వారంతా ఇన్చార్జ్ సీఎండీలే కావడం గమనార్హం. ఐఆర్ఎస్ అధికారి ఎన్ బలరామ్‌నాయక్ 2024 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు, మరో ఐఏఎస్ కృష్ణభాస్కర్ 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి 10 వరకు ఇన్చార్జ్ సీఎండీలుగా పనిచేశారు. కృష్ణభాస్కర్ స్థానంలో తాజాగా జ్యోతిబుద్ధప్రకాశ్ నూతన సీఎండీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో రెండేండ్ల ఇన్చార్జుల పాలనకు ముగింపు పలికినట్టయ్యింది.