Game Changer | హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): సినిమాలను తెల్లవారు జామున నాలుగు గంటలకు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు పేర్కొంది. ప్రతి మనిషికి రాత్రిపూట నిద్ర ఉండితీరాలని తెలిపింది. తెల్లవారుజామున సినిమాల ప్రదర్శనకు అనుమతిస్తే అర్ధరాత్రి లేచి వెళ్లే ప్రేక్షకుడి ఆరోగ్యం ఏం కావాలని ప్రశ్నించింది. పగలు నిద్రపోతే అది నిద్రపోయినట్టు కాదని, రాత్రివేళ నిద్ర ఉండి తీరాలని స్పష్టం చేసింది.
పదహారేండ్లలోపు పిల్లలను తెల్లవారుజాము, అర్ధరాత్రి షోలకు అనుమతించడం సరికాదని అభిప్రాయపడింది. హీరో రామ్‌చరణ్ నటించిన గేమ్‌చేంజర్ సినిమాను తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రదర్శించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేయడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన గొర్ర భరత్‌రాజ్, మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.
ప్రముఖ నటుడు నటించిన సినిమా అయితే మరో నెలరోజులైనా జనం చూసేందుకు వస్తారని, ఒకేరోజు అనేక షోలు ఎందుకు ప్రదర్శించాలని ధర్మాసనం ప్రశ్నించింది. అర్ధరాత్రి, అపరాత్రి, తెల్లవారకుండానే సినిమా ప్రదర్శనలు వేయడం సరికాదని పేర్కొంది. రెండు షోల మధ్య 15 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంటే ఎలా సరిపోతుందని ప్రశ్నించింది. థియేటర్లోని ప్రేక్షకులు బయటకు వెళ్లేందుకు, సినిమా చూడాల్సిన వాళ్లు లోపలికి వచ్చేందుకు పావుగంట సమయం ఎలా సరిపోతుందని సందేహం వ్యక్తం చేసింది. పుష్ప- 2 సినిమా ప్రదర్శనప్పుడు సంధ్య ధియేటర్ వద్ద తొకిసలాట జరిగిందని, నిన్న తిరుపతిలో కూడా జరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని చెప్పిన తర్వాత గేమ్ చేంజర్ సినిమా ఏమిటని ప్రశ్నించింది.
సినిమా రిలీజ్‌కు ముందు కేసులు వేయడంతో సరిపెట్టొద్దని, ఆ తర్వాత కూడా లాజికల్ ఎండ్ కోసం ఎందుకు ప్రయత్నం చేయడం లేదని హైకోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. వాస్తవానికి ఇది ప్రజాహితంతో ముడిపడిన వ్యవహారం కాబట్టి ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎందుకు దాఖలు చేయరని పిటిషనర్లను ప్రశ్నించింది. ఇదే సమయంలో చాలామంది తెల్లవారుజామునే కాకుండా అర్ధరాత్రి షోలకు కూడా వెళ్లేందుకు సుముఖంగా ఉన్నప్పుడు మీకేమిటి అభ్యంతరం అని కూడా పిటిషనర్లను ప్రశ్నించింది. ఉభయపక్షాల వాదనల అనంతరం.. ఈ వ్యాజ్యాలతోపాటు సంధ్య థియేటర్ ఘటనపై దాఖలైన పిటిషన్‌ను కలిపి శుక్రవారం విచారిస్తామని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ప్రకటించారు.
ఈ కేసులో తొలుత పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మహేశ్ మామిండ్ల, సుల్తాన్భాషా, విజయ్‌గోపాల్ వాదనలు వినిపిస్తూ.. సినిమాటోగ్రఫీ చట్టం సెక్షన్ 12 ప్రకారం ఉదయం 8.30 గంటల నుంచి మాత్రమే సినిమా షోలకు అనుమతివ్వాలని చెప్పారు. చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వం మెమో ఇచ్చిందని తెలిపారు. జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, హైదరాబాద్‌లో పోలీస్ కమిషనర్‌కు మాత్రమే టికెట్ల ధరల పెంచే అధికారం ఉందని అన్నారు. అయితే, జీవో 120ని ఉదహరిస్తూ సినిమాను ఏ సమయంలో ప్రదర్శించాలో పేర్కొంటూ ప్రభుత్వం మెమో జారీ చేయడం చెల్లదని చెప్పారు. రాష్ట్రంలో సినిమా బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వబోమని చెప్పిన కొద్దిరోజులకే గేమ్‌చేంజర్ సినిమా స్పెషల్షోకు అనుమతిచ్చిందని తెలిపారు. పుష్ప-2 ప్రదర్శనలో తొకిసలాట తర్వాత ప్రభుత్వం గేమ్‌చేంజర్ సినిమా ప్రదర్శనకు అనుమతివ్వడం చట్ట వ్యతిరేకమని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.