హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్పీ పరీక్షలను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయని ఈ పరిస్థితుల్లో పరీక్షలను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలను జారీచేయబోమని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలపై కౌంటర్ పిటిషన్లో వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేశారు. ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరగనున్న టీఆర్టీ (డీఎస్సీ) పరీక్షలను వాయిదా వేయాలంటూ వికారాబాద్‌కు చెందిన ఆర్ అశోక్ సహా పది మంది దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు(డీఎస్సీ) కొందరు అభ్యర్థుల నిర్బంధం మధ్య గురువారం ప్రారంభమయ్యాయి. తొలిసారిగా ఆన్లైన్ విధానంలో మొదలైన ఈ పరీక్షలు ఆగస్టు 5 వరకు కొనసాగనున్నాయి. తొలిరోజు 26 వేల మందికి 83 శాతం పరీక్షలకు హాజరైనట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 56 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే 27 కేంద్రాలు ఉన్నాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించారు. తమను గృహ నిర్బంధంలో ఉంచి పరీక్షలకు హాజరు కానివ్వలేదని పలువురు అభ్యర్థులు ఆరోపించారు.