(రంగనాథ్ మిద్దెల) హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5(నమస్తే తెలంగాణ): ఇదీ సున్నం చెరువు విస్తీర్ణంపై కొనసాగుతున్న మూడు ముక్కలాట. రెవెన్యూ శాఖ లెక్కలకు, హెచ్ఎండీఏ సర్వేకు, హైడ్రా చెప్తున్న వివరాలకు ఎక్కడా పొంతన లేదు. చెరువు విస్తీర్ణంలోనే ఇంత గందరగోళం ఉండటం ఒక ఎత్తయితే, రెవెన్యూ రికార్డుల ప్రకారం బాలానగర్ మండలం అల్లాపూర్కే పరిమితమైన చెరువు, హెచ్ఎండీఏ, హైడ్రాకు వచ్చేసరికి శేరిలింగంపల్లి మండలంలోని గుట్టలబేగంపేటకు విస్తరించింది. దీని వెనక భౌగోళిక, సాంకేతిక కారణాలున్నాయా? సర్వేల్లో ఏదైనా మతలబు జరిగిందా? అనేవి అత్యంత కీలకమైన అంశాలుగా మారాయి. విస్తీర్ణం ఎంత? ఏయే మండలాల పరిధిలో ఉన్నదో తేలకుండానే సున్నం చెరువులో గుడిసెలు వేసుకొని బతుకుతున్న పేదలను హైడ్రా తరిమేయడం, చెరువుతో సంబంధం లేదంటున్న సియెట్ ఎంప్లాయీస్ కాలనీవాసులను ముప్పు తిప్పలు పెడుతుండటం గమనార్హం. సియెట్ ఎంప్లాయీస్ కాలనీవాసులు హైకోర్టును ఆశ్రయించడం, న్యాయస్థానం హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సున్నం చెరువు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
సాధారణంగా ఒక చెరువును పరిరక్షించాలంటే ముందు దాని ఉనికి ఎంత వరకు ఉందనేది తేలాలి. అందుకే చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, చెరువులోకి వరద నీటిని మోసుకొచ్చే ఫీడర్ చానల్స్, సామర్థ్యానికి మించి వరద వచ్చినపుడు అలుగు పోయాల్సిన తూములు, నీటిని ఒడిసిపట్టే బండ్ (కట్ట) ఇలా నీటి వనరుతో అల్లుకొని ఉన్న అంశాలన్నింటినీ నిర్ధారించుకొని దాని విస్తీర్ణాన్ని తేలుస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులపై ఏండ్ల తరబడి సర్వే చేపట్టారు. ఎట్టకేలకు 2014లో హెచ్ఎండీఏ వేలాది చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌ను నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్లను జారీచేసింది. హైడ్రా ఇప్పటివరకు వీటి ఆధారంగానే చర్యలు తీసకుంటున్నది. కానీ సున్నం చెరువు విషయంలో మాత్రం హైడ్రా దేనిని ప్రాతిపదికగా తీసుకొని, విస్తీర్ణాన్ని నిర్ణయించిందనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. మరోవైపు గుట్టలబేగంపేట గ్రామనక్షాలో సర్వేనంబర్లు 12, 13లలో ఎక్కడా ఒక్కనీటిచుక్క కూడా లేదు. ఈ రెండు సర్వేనంబర్ల చుట్టూ నడకదారిగా చూపించారు. అయినా హెచ్ఎండీఏ, హైడ్రా రికార్డుల్లో చెరువు పరిధిలోకి వచ్చేశాయి.
సున్నం చెరువు పునరుద్ధరణ పేరుతో సియెట్ ఎంప్లాయీస్ కాలనీ పరిధిలోని గుడిసెలను హైడ్రా తొలగించింది. దీంతోపాటు భారీ ఎత్తున ఓపెన్ ప్లాట్లు కూడా చెరువు పరిధిలోకి వస్తున్నాయని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో ఒక్కసారిగా ప్లాట్ల యజమానుల్లో ఆందోళన మొదలైంది. 1982 ప్రాంతంలో భాగ్యనగర్ డెవలప్మెంట్ అథారిటీ గుట్టల బేగంపేటలోని సర్వేనంబరు 12,13ల్లో లేఅవుట్ రూపొందించింది. అందులో అంతర్భాగంగా 1992 ప్రాంతంలో సియెట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌజింగ్ కాలనీ ఏర్పడింది. ఇందులో 236 ప్లాట్లు ఉండగా దాదాపు 188 మంది ఇండ్లు కట్టుకున్నారు. మిగిలిన వారు కాంపౌండ్ వాల్ నిర్మించారు.
ఈ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కూడా ఉన్నది. బాలానగర్ మండలం అల్లాపూర్‌కు మాత్రమే పరిమితమైన చెరువును హెచ్ఎండీఏ తమ సర్వేనంబర్లలోకి వేసిందనేది సియెట్ కాలనీవాసుల ఆరోపణ. అందుకే చాలా కాలంగా కాలనీవాసులు రీసర్వేకు డిమాండ్ చేస్తున్నారు. ఇది తేలకముందే హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టడంతో వివాదం నెలకొన్నది. నిరుడు సెప్టెంబర్‌లో కూల్చివేతలు మొదలుపెట్టగానే సియెట్ కాలనీవాసులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో చెరువు విస్తీర్ణంపై సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయినా నేటిదాకా అమలుకు నోచుకోవడం లేదు.
తెలంగాణవ్యాప్తంగా ఉన్న చెరువులన్నీ దాదాపుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైనవే. బాలానగర్ మండలం అల్లాపూర్ పరిధిలోని సర్వేనంబరు 30లో సున్నం చెరువు ఉన్నదని రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. గుట్టల బేగంపేట ప్రస్తావనే లేదు. 2009లో బాలానగర్ తాసిల్దార్ ఇచ్చిన లిఖితపూర్వక సమాచారంలో సున్నం చెరువు అల్లాపూర్ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 30లో 24.12 ఎకరాలుగా ఉందని ఇచ్చారు. కానీ హెచ్ఎండీఏ సర్వేలో సర్వేనంబరు 30తోపాటు సరిహద్దుగా ఆనుకొని ఉన్న శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటలోని సర్వేనెంబర్లు 12, 13ల్లో కూడా చెరువు విస్తరించి ఉన్నదని తేల్చారు. అంటే చెరువు విస్తీర్ణం ఒక సర్వే నంబర్ నుంచి మూడు సర్వే నంబర్లకు పెరిగింది. ఈ లెక్కన చెరువు విస్తీర్ణం కూడా పెరగాలి. కానీ అందుకు భిన్నంగా రెవెన్యూ రికార్డుల కన్నా హెచ్ఎండీఏ సర్వేలో విస్తీర్ణం 8.29 ఎకరాలు తగ్గింది. ఇక్కడే హెచ్ఎండీఏ సర్వేపై అనుమానాలు కలుగుతున్నాయి. మే నెలలో హైడ్రా ప్రచురించిన బ్రోచర్లో కూడా సున్నం చెరువు వివరాలు పొందుపరిచినపుడు అల్లాపూర్లోనే చెరువు ఉన్నదని స్పష్టంగా పేర్కొన్నది. గుట్టల బేగంపేట ప్రస్తావనే లేదు.
సున్నం చెరువు బాలానగర్ మండలం అల్లాపూర్లోనే ఉన్నట్టు రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డులు స్పస్టం చేస్తున్నాయి. కానీ అల్లాపూర్వైపు చెరువు ఎంత విస్తరించి ఉందనేది ఎవరూ దృష్టిసారించడంలేదనే విమర్శలు ఉన్నాయి. అల్లాపూర్ వైపు దిగువ ప్రాంతమైనందున అక్కడ చెరువు కట్ట, తూములు ఉన్నాయి. ఇరిగేషన్ రికార్డు ప్రకారం సున్నం చెరువు నుంచి వరద అల్లాపూర్ వైపు దిగువన ఉన్న మైసమ్మ చెరువులోకి, తద్వారా ఎనిమిది గొలుసుకట్టు చెరువుల్లోకి వరద పారుతుంది. కాబట్టి రెవెన్యూ రికార్డు ప్రకారంగా అల్లాపూర్‌లో చెరువు విస్తీర్ణాన్ని నిర్ధారిస్తే ఆ తర్వాత గుట్టల బేగంపేటలోని విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశముందని ఒక రిటైర్డ్ ఇంజినీర్ సూచించారు. ఇది వదిలేసి గుట్టల బేగంపేట మీద మాత్రమే శ్రద్ధ పెడుతుండటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం హైడ్రా చెప్తున్న సున్నం చెరువు విస్తీర్ణం మరోలా ఉన్నది. మే 8న సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన సందర్భంగా హైడ్రా విడుదల చేసిన బ్రోచర్లో సున్నం చెరువు విస్తీర్ణాన్ని 42.07 ఎకరాలుగా పొందుపరిచారు. అందులో ఎఫ్టీఎల్ 32.20 ఎకరాల్లో విస్తరించి ఉండగా, ప్రస్తుతం నీళ్లు విస్తరించి ఉన్న ప్రాంతం 14.18 ఎకరాలు, ప్రతిపాదిత ప్రాంతం 23.32 ఎకరాలుగా పేర్కొన్నారు. ఇటీవల హైడ్రా కమిషనర్ మీడియాకు వెల్లడించినప్పుడు 1970 సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్ ప్రకారం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలుగా ఉన్నదని తెలిపారు. 2016లో హెచ్ఎండీఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ప్రకారం చెరువు 32 ఎకరాలుగా ఉన్నదని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో హెచ్ఎండీఏ చెరువులపై సర్వే చేపట్టింది. అధికారులు సున్నం చెరువుకు (సుద్దలవాని కుంట) ఐడీ నంబరు 4805 ఇచ్చారు. 2014 మే 14న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. దాని ప్రకారం సున్నం చెరువు విస్తీర్ణం 15.23 ఎకరాలుగా పేర్కొన్నారు. చెరువు విస్తీర్ణాన్ని బాలానగర్ మండలంలోని అల్లాపూర్ సర్వేనంబరు 30తో పాటు శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వేనంబరు 12, 13లో కొంతభాగం ఉన్నట్లు క్యాడస్ట్రల్ మ్యాప్‌ను పొందుపరిచారు. ఒక సందర్భంలో 2023లో ఎన్జీటీకి ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఇచ్చిన నివేదికలోనూ హెచ్ఎండీఏ సర్వే చేసిన ప్రకారం సున్నం చెరువు విస్తీర్ణం 15.23 ఎకరాలుగా స్పష్టంచేశారు.
ఇది.. సున్నం చెరువు విస్తీర్ణంపై బాలానగర్ మండలం డిప్యూటీ తాసిల్దార్ అధికారికంగా ఇచ్చిన సమాచారం. విస్తీర్ణం 24.12 ఎకరాలుగా పేర్కొన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో 2009 జూన్ 8న సియెట్ ఎంప్లాయీస్ కాలనీకి చెందిన ఒక మహిళ సమాచార హక్కు చట్టం కింద ఈ సమాచారాన్ని కోరారు. తమ వద్దనున్న రికార్డుల ఆధారంగా సున్నం చెరువు బాలానగర్ మండలం అల్లాపూర్ సర్వేనంబరు 30లో ఉందని, చెరువు మొత్తం విస్తీర్ణం 24.12 ఎకరాలుగా పొందుపరిచారు. అప్పట్లో గుట్టల బేగంపేట అల్లాపూర్ పరిధిలో ఉండగా, ఇప్పుడు శేరిలింగంపల్లి మండల పరిధిలోకి వచ్చింది.