హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీలను కాంట్రాక్ట్ పేరుతో ఏండ్లపాటు సేవలు చేయించుకుని సర్వీస్ క్రమబద్ధీకరించకుండా ఇప్పుడు కొత్తగా చేపట్టే నియామకాల్లో పాల్గొనాలని చెప్పడం సరికాదని హైకోర్టు హైకోర్టు అభిప్రాయపడింది. కోర్టును ఆశ్రయించిన వారిని క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో చాలా ఏండ్లుగా పనిచేస్తున్న తమ సర్వీస్‌ను క్రమబద్ధీకరించకుండా కొత్తగా నోటిఫికేషన్ జారీచేయడాన్ని సవాల్ చేస్తూ 2013లో దాదాపు 200 మంది అంగన్వాడీలు వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో అప్పట్లో నోటిఫికేషన్‌పై స్టే మంజూరుచేయగా వారు ఇప్పటికీ కాంట్రాక్ట్ పద్ధతిలోనే కొనసాగుతున్నారు.
తమ సర్వీసును క్రమబద్ధీకరించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన మీరాభాయ్ తదితరులు మరో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నగేశ్ భీమపాక తాజాగా విచారణ చేపట్టి తీర్పును వెలువరించారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సూపర్వైజర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో అంగన్వాడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 15 శాతం వెయిటేజీ కేటాయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. గతంలో వారు రెగ్యులర్ పోస్టులకే ఎంపికయ్యారని, కానీ నియామకాలపై నిషేధం ఉండటంతో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇప్పుడు నిషేధం తొలగించిన తర్వాత దశాబ్దాలుగా సేవలు అందించిన వారిని విస్మరించి కొత్త నియామకాలు చేపడతామంటే అంగీకరించబోమని పేర్కొన్నారు. వారు దాదాపు 25 సంవత్సరాలు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన తర్వాత ఇప్పుడు పరీక్షలు రాసి ఎంపిక ప్రక్రియలో పాల్గొనాలనడం చట్టవిరుద్ధమన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైన వారిని క్రమబద్ధీకరించి, ఆ తర్వాత ఖాళీలు ఉంటే తాజాగా నియామకాలు చేపట్టవచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నవారు అనర్హులని గానీ, వారికి అర్హతలేదని గానీ అధికారులు చెప్పడం లేదని గుర్తు చేశారు. ‘జాగ్గొ వర్సెస్ కేంద్రం’, ‘కర్ణాటక వర్సెస్ ఉమాదేవి’ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం పిటిషనర్లను క్రమబద్ధీకరించాల్సిందేనని తేల్చిచెప్పారు. క్రమబద్ధీకరణ అనంతరం పదవీ విరమణానంతర ప్రయోజనాల కల్పనలో సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.