హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో పెట్టిన ఆహారం తిని 110 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఘటనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం నోటీసులు జారీచేసింది.
వసతి గృహాలు, పాఠశాలల్లో వసతుల కల్పనకు సంబంధించి జాతీయ బాలల హకుల కమిషన్ జారీచేసిన మార్గదర్శకాలు అమలు కావడం లేదంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై మంగళవారం ఈ నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది.