పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బుధవారం రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీచేసింది. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉన్న శాసనసభ స్పీకర్‌కు కూడా నోటీసులు పంపింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది.
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపు ఎమ్మెల్యేలు టీ ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వచ్చిన పిటిషన్లను కొట్టివేస్తూ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇచ్చిన తీర్పులను పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ, కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అనేక ఆధారాలు చూపినప్పటికీ స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలతోపాటు సుప్రీంకోర్టు తీర్పులను కూడా సమర్పించినప్పటికీ స్పీకర్ అనర్హత పిటిషన్లను కొట్టివేయడం చెల్లదని అన్నారు. వారంతా బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యాక అధికార కాంగ్రెస్ పార్టీ పంచన చేరారని చెప్పారు. పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఆ పార్టీ కండువా కప్పుకొన్నారని తెలిపారు. ఈ చేరికల వార్తలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యాయని, పలు ఎలక్ట్రానిక్ మీడియాల్లో, పత్రికల్లో కూడా ప్రచురితమైందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరకముందు, చేరిన తరువాత కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాలకు వారంతా హాజరయ్యారని తెలిపారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరో అడుగు ముందుకువేసి సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారని చెప్పారు. దానం పార్టీ ఫిరాయించారని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇచ్చిన బీఫాం తీసుకుని ఎన్నికల్లో పోటీచేశారని తెలిపారు. మరో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా క్యాబినెట్ హోదా పదవిలో కొనసాగుతున్నారని వివరించారు. ఇలాంటి ఎన్నో ఆధారాలను స్పీకర్ ముందు పెట్టినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా స్పీకర్ ఏకపక్షంగా అనర్హత పిటిషన్లను కొట్టివేశారని చెప్పారు. స్పీకర్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరారు.
పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటువేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేసి ఏడాది గడిచినా స్పీకర్ స్పందించలేదని గుర్తుచేశారు. దీనిపై హైకోర్టు, ఆ పైన సుప్రీంకోర్టుకు వెళ్తే తప్ప ఫలితం లభించలేదని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాతే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. సుప్రీంకోర్టు గడువు నిర్దేశించడంతో పిటిషన్లపై స్పీకర్ తుది ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. నేటికీ స్పీకర్ వెలువరించిన తీర్పు ప్రతులు అందుబాటులోకి రాలేదని అన్నారు. స్పీకర్ తీర్పును రద్దు చేసి, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులైన ఏడుగురు ఎమ్మెల్యేలతోపాటు ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్న స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.