Group 1 | రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలను తాతాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ ఎం. పరమేశ్ మరో 20 మంది అభ్యర్థులు దాఖలు చేసిన కేసులో న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ఈ నెల 17న నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. తాజాగా ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చింది.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది రచనా రెడ్డి, టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది రాజశేఖర్ తమ వాదనలు వినిపించారు. రీకౌంటింగ్‌లో ఓ అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయని రచనా రెడ్డి కోర్టుకు తెలపడంతో సదరు అభ్యర్థి పత్రాలు కోర్టుకు సమర్పించాలని టీజీపీఎస్సీని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణలో పత్రాలు సమర్పిస్తామని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది తెలిపారు. వెకేషన్లోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ చెప్పిందని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. కాగా, విచారణను వేగంగా ముగించలేమని జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు తెలిపారు. వేలాది మందికి సంబంధించిన విషయం కాబట్టి తొందరపడవద్దని, వెంటనే తీర్పు కావాలని ఒత్తిడి చేయవద్దని సూచించారు. తదుపరి విచారణను ధర్మాసనం జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వెల్లడించింది.